Top

బిక్కుబిక్కు మంటూ గడుపుతున్న బెంగాల్ ప్రజలు

బిక్కుబిక్కు మంటూ గడుపుతున్న బెంగాల్ ప్రజలు
X

బెంగాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. వరుస ఘర్షణలతో బెంగాల్ ప్రజలు బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు. భట్‌పరా ప్రాంతంలో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగా ఉంది. ఇక్కడ నిన్న జరిగిన అల్లర్లలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, నలుగురు గాయపడ్డారు. శుక్రవారం కూడా భట్‌పరాలో భారీ శబ్దాలు వినిపించాయి. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇప్పటి వరకు అల్లర్లకు కారణమైన 16 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భట్‌పరా, జగద్దల్‌ ప్రాంతంలో దుకాణాలు, వ్యాపార సముదాయాలను అధికారులు మూసివేయించారు. రాష్ట్రంలో పలు చోట్ల ముందస్తు చర్యల్లో భాగంగా ఇంటర్నెట్‌ సేవల్ని నిలిపివేశామన్నారు. గురువారం చెలరేగిన హింసాత్మక ఘటనలతో 144 సెక్షన్‌ విధించారు. భట్‌పరలోని మార్కెట్‌ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారు జామున కూడా భారీ శబ్దాలు వినిపించినట్లు స్థానికులు తెలిపారు.

ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక స్థానికులు భయం గుప్పిట గడుపుతున్నారు. అక్కడ పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలుచేపట్టింది. డీజీపీతో పాటు పలువురు ముఖ్య అధికారులతో సమావేశమైన సీఎం మమతా బెనర్జీ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. గత కొన్ని రోజులుగా చెలరేగుతున్న హింసాత్మక ఘటనలపై బీజేపీ, తృణమూల్‌ కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. శాంతి భద్రతల పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీఆరోపిస్తుండగా.. బీజేపీ నేతలే కావాలని హింసను ప్రోత్సహిస్తున్నారని టీఎంసీ విమర్శిస్తోంది.

2018లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వివిధ పార్టీలను పోటీ చేయకుండా అడ్డుకోవడం ద్వారా దాదాపు 40 శాతం సీట్లను టీఎంసీ నెగ్గింది. అప్పటి నుంచి టిఎంసీ పట్ల సీపీఎం, బీజేపీ పార్టీ కార్యకర్తలతో ఆగ్రహం పెరిగింది. లోక్‌సభ ఎన్నికల నాటికి సీపీఎం, సీపీఐ కార్యకర్తలు బీజేపీతో చేతులు కలపడంతో.. ఇరు పక్షాల మధ్య దాడులు పెరిగాయి. ఇలా రాజకీయ కక్షలు తారాస్థాయికి చేరడం అల్లర్లు చల్లారడం లేదు.

Next Story

RELATED STORIES