బంగాళాఖాతంలో అల్పపీడనం.. విస్తారంగా వర్షాలు..

బంగాళాఖాతంలో అల్పపీడనం.. విస్తారంగా వర్షాలు..
X

ఎట్టకేలకు రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించాయి.. దీంతో రెండు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఎండ వేడిమి, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు పలుచోట్ల కురిసిన వర్షం ఊరటనిచ్చింది. వాతావరణంలో మార్పులు, అరేబియా సముద్రంలో వాయు తుఫాన్ ప్రభావంతో రుతుపవనాల రాక 20రోజులు ఆలస్యమైనా చివరికి తెలుగు రాష్ట్రాల్లోకి అడుగుపెట్టాయి.

తెలగాణలో హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి, చేవెళ్ల, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో వర్షం కురిసింది.. పలు చోట్ల విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో వర్షం కురిసింది. అలాగే జనగాం, మహబూబాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్ రూరల్, భూపాలపల్లి, కామారెడ్డి, మంచిర్యాల సహా అనేక జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.. ఆంధ్రప్రదేశ్‌లోనూ పలు ప్రాంతాలను వర్షం పలుకరించింది.. వాతావరణం చల్లగా మారడంతో ఉక్కపోతల నుంచి ప్రజలకు కొంత ఉపశమనం లభించింది.. మరోవైపు నిన్నటి వరకు బీళ్లు వారిన నేలలు వర్షంతో తడిసిపోయాయి. దీంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.. తొలకరి పలుకరించడంతో ఏరువాకకు సిద్ధం అవుతున్నారు రైతులు.

వచ్చే రెండు మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా రుతుపవనాలు పూర్తిగా విస్తరిస్తాయని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ సారి రాష్ట్రంలో సుమారు 97శాతం వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో ఈసారి వర్షాలు ఆశాజనకంగా ఉండే అవకాశం ఉందని వెల్లడించారు. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, దీంతో రాష్ట్రంలో మంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. మరోవైపు తెలంగాణలో 755 మిల్లీ మీటర్లు, ఆంధ్రప్రదేశ్‌లో 931 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు చెబుతున్నారు.

Next Story

RELATED STORIES