నెలల బిడ్డ కడుపులో నెయిల్ కట్టర్..

నెలల బిడ్డ కడుపులో నెయిల్ కట్టర్..

ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే నోట్లో ఏం పెట్టుకుంటారో అని భయం. పాకడం మొదలు పెట్టిన చిన్నారులైతే కనిపించిన ప్రతిదీ నోట్లో పెట్టుకుంటారు. అందుకే తల్లి ఓ కన్నెప్పుడూ బిడ్డ మీద వేసి వుంచుతుంది. అయినా ఎప్పుడు పెట్టేసుకుందో.. ఎలా పెట్టేసుకుందో ఏడు నెలల చిన్నారి తనకి నెయిల్స్ కట్ చేసేందుకు వాడే నెయిల్ కట్టర్‌ని నోట్లో పెట్టేసుకుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన మౌర్య రాజు,లక్ష్మి దంపతులు ఇటీవల గుంటూరు జిల్లా వినుకొండకు వలస వచ్చారు. వారికి ఏడు నెలల పాప రజని ఉంది. ఈ నెల 20న ఇంట్లో ఆడుకుంటున్నఆ చిన్నారి నెయిల్ కట్టర్ మింగేసింది. చూస్తుండగానే అది కాస్తా కడుపులోకి వెళ్లిపోయింది. వెంటనే గమనించుకున్న తల్లి బిడ్డని తీసుకుని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి పరిగెట్టింది. పరీక్షించిన సీనియర్ వైద్యులు యశోధర.. జీర్ణకోశ సంబంధిత వైద్యురాలు కవిత దృష్టికి తీసుకువెళ్లారు. ఆమె ఎక్స్‌రే తీసి నెయిల్ కట్టర్ జీర్ణకోశంలో ఉన్నట్లు గుర్తించారు. శుక్రవారం మధ్యాహ్నం ఎండోస్కోపీ చేసి పాపకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నెయిల్ కట్టర్‌ని బయటకు తీశారు డాక్టర్ కవిత. బిడ్డ ఆరోగ్యంగా ఉందని ఇంటికి తీసుకువెళ్లమని వైద్యులు చెప్పడంతో పాప తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story