సొంతింటి కల నెరవేరాలంటే.. మార్కెట్ గురించి కొంతైనా..

సొంతింటి కల నెరవేరాలంటే.. మార్కెట్ గురించి కొంతైనా..
X

మన బడ్జెట్లో ఓ మంచి ఇల్లు కొనుక్కోవాలి. అందుకోసం ఎవరిని సంప్రదించాలి. చిన్న ఇల్లు కొనాలన్నా పెద్ద హోం వర్కే చేయాలి. అప్పుడే మీ కల సాకారమవుతుంది. ఇల్లు కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్న తరువాత దృష్టి పెట్టవలసిన అంశాలు కొన్ని.. అవి..

మీరు ఉంటున్న నగరంలో గృహాల మార్కెట్ ఎలా ఉందో ముందుగా తెలుసుకోవాలి. ఇందుకోసం తెలిసిన వారి ద్వారా సమాచారం సేకరించాలి. గృహాల కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన సమాచారం పేపర్లు, టీవీల్లో వస్తుంది వాటి వివరణలు, విశ్లేషణలు తెలుసుకుంటే కొంత అవగాహన వస్తుంది. కొన్ని వెబ్‌సైట్లు వివిధ ప్రాంతాల్లోని గృహ ప్రాజెక్టులతో పాటు వాటి ధరల వివరాలను కూడా తెలియజేస్తున్నాయి. బడ్జెట్‌కు అనుకూలంగా ఉన్న వాటిని ఎంచుకుని, వసతుల గురించి ఎంక్వైరీ చేయండి. ఆ ఏరియాలో ధరలు పెరగడానికి, తగ్గడానికి గల కారణాలపై దృష్టి సారించండి.

ఇల్లు కొనుగోలుకు అవసరమైన నిధులు మీ వద్ద ఉన్నాయో లేదో చూసుకోండి. మీ దగ్గరున్న సొమ్ముతో పాటు ఎంత రుణం అవసరమవుతుంది.. ఎంత ఈఎమ్‌ఐ చెల్లించాల్సి ఉంటుంది లెక్కలు వేసుకోవాలి. ఇంటికి సంబంధించిన ఈఎంఐ కట్టడంతో పాటు, మీ రిటైర్మెంట్ సేవింగ్స్, జీవిత భీమా పాలసీలు, పిల్లల చదువుల కోసం ఎంత మొత్తం అవసరం ఉంటుందో చూసుకోవాలి. ఆ స్థాయిలో మీకు ఆదాయం వస్తుందో లేదో చూసుకోవాలి. గుర్తుంచుకోవలసిన మరో ముఖ్య విషయం.. అత్యవసర సందర్భాల్లో మీ దగ్గర కొంత మొత్తం ఉండేలా ప్లాన్ చేసుకోవాలి.

ఇంటి రుణం కోసం ఏదో ఒక ఫైనాన్స్ కంపెనీని కాకుండా.. కొంత సమయం కేటాయించి అందుబాటులో ఉన్న ఫైనాన్స్ కంపెనీలు లేదా బ్యాంకులు వసూలు చేస్తున్న వడ్డీ రేట్ల గురించి వివరంగా తెలుసుకోవడం ఎంతైనా అవసరం. స్థిర, చర వడ్డీతో పాటు రుణ మంజూరుకు తీసుకునే ప్రాసెసింగ్ ఫీజు, ముందుగా రుణాన్ని చెల్లిస్తే వసూలు చేసే చార్జీల వివరాలు, కన్వర్షన్ ఫీజు లాంటి వివరాలు తెలుసుకోవాలి. టాప్ అప్ రుణ సదుపాయం, సర్వీసుల వివరాలు తెలుసుకోవడం ముఖ్యం. ఏళ్ల తరబడి ఈఎంఐ చెల్లించాల్సి వస్తుంది కాబట్టి మంచి రుణ సంస్థను ఎంచుకుంటే మంచిది.

ఈఎంఐని పెంచుకోవాలా లేక రుణ కాలపరిమితిని పెంచుకోవాలా అనే దాని విషయంలో చాలా మందికి స్పష్టత ఉండదు. వడ్డీ రేట్లను, ద్రవ్యోల్బణం వంటి వాటిని దృష్టిలో పెట్టుకుంటే రుణ కాలపరిమితి ఎక్కువగా ఉంచుకోవడమే మంచిది. దీనివలన చెల్లించాల్సిన ఈఎంఐ భారం తగ్గుతుంది. ఆర్థిక సంస్థలు కూడా ఇదే విషయాన్ని సూచిస్తాయి. అయితే రుణ కాలపరిమితి మీ రిటైర్మెంట్ లోపు పూర్తయ్యేలా ఉంటే మంచిది.

ప్రతి ఒక్కరికి ఇల్లు కల్పించాలన్నది కేంద్ర ప్రభుత్వ సంకల్పం. ఇందుకోసం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని ద్వారా గృహ రుణంపై వడ్డీ రాయితీ పొందవచ్చు. కాబట్టి దీనికి సంబంధించిన వివరాలకోసం మీ బ్యాంకు వారిని అడిగి వివరాలు తీసుకోవచ్చు. ఇక పండగలు, లోన్ మేళాలు, ప్రాపర్టీ షో ల ద్వారా ప్రత్యేకమైన ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తుంటాయి. ఇలాంటి వాటిని వినియోగించుకుంటే ప్రయోజనం ఉంటుంది.

Next Story

RELATED STORIES