టీటీడీ చైర్మన్‌గా నేడు బాధ్యతలు స్వీకరించనున్న వైవీ సుబ్బారెడ్డి

టీటీడీ చైర్మన్‌గా నేడు బాధ్యతలు స్వీకరించనున్న వైవీ సుబ్బారెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్‌గా వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి నియమితులయ్యారు. నియామక పత్రాలపై ముఖ్యమంత్రి జగన్‌ సంతకం చేశారు.. ఆ తర్వాత టీటీడీ చైర్మన్ నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. హిందూ ధార్మిక సంస్థలు, దేవాదాయ చట్టం 1987 ప్రకారం టీటీడీకి కొత్త బోర్డును ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర దేవాదాయ శాఖ పేర్కొంది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీచేశారు. ముఖ్యమంత్రి జగన్‌కు వైవీ సుబ్బారెడ్డి దగ్గరి బంధువు.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎంపీ టికెట్‌ ఆశించినప్పటికీ దక్కలేదు.. ఆ తర్వాత రాజ్యసభకు పంపిస్తారని భావించగా.. ఊహించని విధంగా టీటీడీ ఛైర్మన్‌ బాధ్యతలు అప్పగిస్తూ జగన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు..

గరుడ ఆళ్వార్ సన్నిధిలో ఈరోజు వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇప్పటికే కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలో బస చేశారు.. అంతకు ముందు తిరుచానూరులోని పద్మావతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఈ సందర్భంగా టీటీడీ సిబ్బంది, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికారు. టీటీడీ ఛైర్మన్‌గా పనిచేసే అవకాశం కల్పించిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. టీటీడీలో సమూల మార్పులు తీసుకువస్తానని.... సామాన్య భక్తుల సేవలో తరిస్తానని చెప్పారు. శ్రీవారి కీర్తిని ప్రపంచ నలుమూలలా వ్యాపింపజేసే ప్రయత్నం చేస్తానని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.

టీటీడీ ఛైర్మన్‌గా వైవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత నూతన పాలక మండలి నియామకం జరుగుతుంది.. త్వరలోనే సభ్యులను ప్రభుత్వం నియమించనుంది.. మరోవైపు ప్రస్తుత పాలకమండలిని ప్రభుత్వం రద్దు చేసింది. పాలక మండలి సభ్యులుగా సుధా నారాయణమూర్తి, సుగవాసి ప్రసాద్‌బాబు, రుద్రరాజు పద్మరాజు, పెద్దిరెడ్డి, డొక్కా జగన్నాథంతో పాటు పలువురి రాజీనామాలకు కూడా ఆమోదం తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story