ఆయన్ని పీసీసీ చీఫ్‌గా నియ‌మించండి..హైకమాండ్‌కు రేవంత్‌ రెడ్డి సలహా..

ఆయన్ని పీసీసీ చీఫ్‌గా నియ‌మించండి..హైకమాండ్‌కు రేవంత్‌ రెడ్డి సలహా..

తెలంగాణ కాంగ్రెస్ ప్రక్షాళనపై ఫోకస్‌ పెట్టింది హైకమాండ్. ఇప్పటికే పీసీసీ రేసు మొదలైంది. ముఖ్యనేతలంతా ఢిల్లీ లాబింగ్ తో అనుకూల .. వ్యతిరేక పావులు కదపడంలో బిజీ అయ్యారు. ఇంత‌కీ పీసీసీ రేసులో ఎవ‌రెవ‌రున్నారు ? కెప్టెన్ స్థానంలో ర‌థ‌సార‌థిగా ఎవ‌రు రాబోతున్నారు?.

తెలంగాణ పీసీసీ ప్రక్షాళనకు కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధమైంది. ఢిల్లీ పెద్ద‌లు క‌స‌ర‌త్తు ముమ్మ‌రం చేశారు. దీంతో పీసీసీ ప‌ద‌వి ఆశిస్తున్న వారు... ప్ర‌యత్నాల్లో స్పీడ్ పెంచారు. నిజానికి .. కొత్త పీసీసీ అధ్యక్షుని సారథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తారన్న ప్రచారం జ‌రిగినా.. హైకమాండ్‌ ఉత్తమ్ పైనే భరోసా ఉంచింది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడింది. దీంతో అప్పట్లో పీసీసీ చీఫ్‌ మార్పుపై తథ్యమనుకున్నారు. కానీ హైకమాండ్‌ ఉత్తమ్‌నే కంటిన్యూ చేసింది. పార్లమెంట్ ఎన్నికల బాధ్యతలను ఆయనకే అప్పగించింది. ఆ ఎన్నికల్లో 3 ఎంపీ స్థానాల్లో గెలవడం కాంగ్రెస్‌ కాస్త ఊరటనిచ్చింది......

రాహుల్ ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సోనియా హయాంలో నియమించిన పీసీసీ అధ్యక్షులను కొనసాగించారు. ఉత్తమ్ ఇప్పటికే నాలుగేళ్ల పదవికాలన్ని పూర్తి చేశారు. పార్టీ ప్ర‌క్షాళ‌న‌లో భాగంగా టీ కాంగ్రెస్‌లోనూ మార్పులు చేయాలని నిర్ణయించింది. దీంతో ఉత్త‌మ్ స్థానంలో పార్టీ ప‌గ్గాలు ఎవ‌రికి అప్ప‌జెప్తారనేది ఆసక్తిగా మారింది. రేసులో వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి ముందున్నారు. కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి, శ్రీ‌ధ‌ర్ బాబు.. మాజీ ఎమ్మెల్యే సంప‌త్ కుమార్ గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే సోద‌రుడు రాజ‌గోపాల్ రెడ్డి.. బీజేపీలో చేరనున్న నేపథ్యంలో వెంక‌ట్ రెడ్డికి అవ‌కాశాలు స‌న్న‌గిల్లాయి. ఇక శ్రీ‌ధ‌ర్ బాబు, సంప‌త్ ల‌తో ప్ర‌యోగం చేయ‌డం స‌రికాద‌నే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక మిగిలింది రేవంత్‌రెడ్డి, జీవ‌న్ రెడ్డి. వీరిద్దరిలో రేవంత్ రెడ్డి వైపే హైకమాండ్‌ మొగ్గుతున్నట్టు సమాచారం.

అయితే రేవంత్ రెడ్డి తాను పీసీసీ అధ్యక్ష పదవి తీసుకోవాలంటే కొన్ని ష‌ర‌తులు పెట్టినట్లు తెలుస్తోంది. పూర్తి స్వేచ్త్చ ఇవ్వాల‌ంటున్నారాయన. తన నిర్ణ‌యాల్లో ఏఐసీసీ ఇంచార్జ్‌ వేలు పెట్ట‌కూడ‌ద‌ని చెప్పార‌ట‌. ఏది చేసినా హైక‌మాండ్‌కు చెప్పే చేస్తానని కరాఖండీగా చెప్పినట్టు సమాచారం. క్ర‌మశి‌క్ష‌ణ ఉల్లంఘ‌న‌ల‌పై క‌ఠిన చర్యలు తీసుకునే అధికారం తనకే ఇవ్వాలని కోరారట. దీంతో హైకమాండ్‌ అలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఒక‌వేళ త‌న‌కు ఇవ్వ‌డం వీలు కాక‌పోతే.... జీవ‌న్ రెడ్డికి అవ‌కాశం ఇవ్వాల‌ని కోరినట్లు తెలుస్తోంది. ఆయన్ని పీసీసీ చీఫ్‌గా నియ‌మిస్తే.. ఆర్థిక ప‌ర‌మైన విష‌యాల్లో వెన‌కుండి న‌డిపిస్తాన‌ని హైకమాండ్‌ చెప్పారట రేవంత్‌ రెడ్డి.....

మరోవైపు ఏఐసీసీ ఇంఛార్జ్ కుంతియాను సైతం మారుస్తారని ప్రచారం. మెజార్టీ నేతలు మార్పును కోరుకుంటున్నారు. తెలంగాణపై కుంతియాకు అవగాహన లేదంటున్నారు. దీనివల్ల పార్టీకి తీవ్రనష్టం జరిగిందనే అభిప్రాయం వినిపిస్తోంది. ఆయనపై హైకమాండ్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో కుంతియాను మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో కొత్త పీసీసీ చీఫ్‌గా బాధ్య‌త‌లు చేపట్టడం సవాలే. దీంతో ఎవ‌రికి పార్టీ ప‌గ్గాలు అప్ప‌జెప్పుతార‌నే చ‌ర్చ జరుగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story