సీఎం దృష్టికి తీసుకెళ్లి... త్వరలోనే ఆ సమస్యను పరిష్కరిస్తా

సీఎం దృష్టికి తీసుకెళ్లి... త్వరలోనే ఆ సమస్యను  పరిష్కరిస్తా

సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యం ఉంటుందని టీటీడీ బోర్డ్‌ కొత్త ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం టీటీడీ పాలక మండలి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు వైవీ. వారం రోజుల్లో పూర్తిస్థాయి పాలక మండలి ఏర్పడుతుందని చెప్పారు.. ఇక స్వామి వారి ఆభరణాల విషయంలో వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిస్తామని చెప్పారు.

తిరుమల తిరుపతి దేవస్థానంలో కొత్త పాలక మండలి కొలువుదీరబోతోంది.. టీటీడీ ట్రస్ట్‌ బోర్డు నూతన ఛైర్మన్‌గా వైసీపీ సీనియర్‌ నేత వైవీసుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గరుడ ఆళ్వార్‌ సన్నిధిలో వైవీ ప్రమాణ స్వీకారం చేశారు.. టీటీడీ ఈవో అనిల్‌ సింఘాల్‌ దగ్గరుండి ప్రమాణం చేయించారు.. ప్రమాణ స్వీకారం అనంతరం శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు వైవీ సుబ్బారెడ్డి.. ఆ తర్వాత ఆరు రకాల పదార్థాలతో స్వామి వారికి తులాభారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వైవీసుబ్బారెడ్డి దంపతులకు ఆశీర్వచనం అందించారు. ఆ తర్వాత సామాన్య భక్తులతో కలిసి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.

తిరుమల ప్రతిష్టను పెంచడమే తన ప్రథమ కర్తవ్యమని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. హిందూ సంప్రదాయాలకు, ఆగమశాస్త్రానికి కట్టుబడి వుంటామని చెప్పారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి శ్రీవారి దివ్య దర్శనం త్వరగా జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

అటు వారం రోజుల్లో పూర్తి స్థాయిలో పాలకమండలి ఏర్పడుతుందని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.. స్వామి వారి ఆభరణాలపై అనేక ఆరోపణలు వచ్చాయని వాటన్నింటిపైనా విచారణ జరిపిస్తామని చెప్పారు... అర్చకుల వివాదంపై పీఠాధిపతులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు వైవీ సుబ్బారెడ్డి. కొండపై ఉన్న నీటి సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి... శాశ్వత పరిష్కారాని సూచిస్తామని ఆయన అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story