ప్రజావేదికలో తొలిసారిగా కలెక్టర్ల సదస్సు

ప్రజావేదికలో తొలిసారిగా కలెక్టర్ల సదస్సు

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్‌ జగన్‌ తొలిసారిగా కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తున్నారు. నేడు, రేపు జరగనున్న సదస్సులో నవరత్నాల అమలుతోపాటు శాంతి భద్రతలపైనా చర్చించనున్నారు.. పరిపాలనలో పారదర్శకత, వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ సరఫరాపై సమీక్షలు జరుగుతాయి. రేపు శాంతి భద్రతలపై జగన్‌ సమీక్ష నిర్వహిస్తారు.

అమరావతిలో కలెక్టర్ల సదస్సుకు సర్వం సిద్ధమైంది.. ఉండవల్లిలోని ప్రజావేదికలో నిర్వహిస్తున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఉదయం 10 గంటలకు మొదలయ్యే సదస్సులో మొదట ముఖ్యమంత్రి కీలక ఉపన్యాసం చేస్తారు. జగన్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి కలెక్టర్ల సమావేశం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడంలో భాగంగా తన భవిష్యత్‌ ప్రణాళికలను కలెక్టర్లకు వివరించనున్నారు ముఖ్యమంత్రి. మొదట ఒక్కరోజే కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రకటించినా, ఆ తర్వాత షెడ్యూల్‌లో మార్పులు జరిగాయి. చివరి నిమిషంలో రెండు రోజులపాటు సదస్సు జరపాలని నిర్ణయించారు. ఈరోజు మధ్యాహ్నం ౩ గంటలకు తొలిరోజు సదస్సు ముగుస్తుంది. శాంతిభద్రతలపై రేపు ఉదయం పదకొండున్నరకు పోలీస్ అధికారులు, ఎస్పీలతో సీఎం జగన్ సమీక్ష నిర్వహిస్తారు.

కలెక్టర్లతో భేటీలో నవరత్నాల అమలుతో పాటు వ్యవసాయం, విద్యారంగంపై ప్రధానంగా ఫోకస్ చేయనున్నారు సీఎం జగన్. గ్రామ సచివాలయం, గ్రామ వలంటీర్ల విధివిధానాలపై చర్చ జరగనుంది. దీనిపై పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ, పురపాలక శాఖలు నివేదికలు సమర్పిస్తాయి. ఆరోగ్యశ్రీతో పాటు 108, 104 అమలు, వైద్య, ఆరోగ్యశాఖ పరిధిలోని ఇతర అంశాలపై చర్చ, ఆ తర్వాత పౌరసరఫరాల శాఖపై సమీక్ష ఉంటుంది. ఇంటింటికీ నిత్యావసరాలు సరఫరా చేయడంపైనా చర్చించనున్నారు. విద్యాశాఖ కార్యక్రమాల అమలు, వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ఆయా శాఖల అధికారులతో సీఎం జగన్ చర్చిస్తారు. సామాజిక ఫించన్లు, గృహనిర్మాణం, ఇళ్ల స్థలాలపైనా ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు.

ఇక రెండో రోజు మొత్తం శాంతిభద్రతలపైనే చర్చ జరుగుతుంది. శాంతి భద్రతలపై కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహిస్తారు. అంతకు ముందు పోలీస్ అధికారులు, ఎస్పీలతో సీఎం ప్రత్యేక సమావేశమవుతారు.

Tags

Read MoreRead Less
Next Story