తాజా వార్తలు

టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాలకు రాష్ట్రవ్యాప్తంగా భూమి పూజలు

టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాలకు రాష్ట్రవ్యాప్తంగా భూమి పూజలు
X

తెలంగాణలోని 29 జిల్లాల్లో పార్టీ కార్యాలయ భవన నిర్మాణాలకు TRS శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఆపార్టీ నేతలు ఘనంగా భూమి పూజలు నిర్వహించారు. జిల్లాల ముఖ్యనాయకులు, కార్తకర్తలు, TRS అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో TRS పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆధ్వర్యంలో భూమి పూజ జరిగింది. యూత్‌ కమిటీ నుంచి రాష్ట్ర కమిటీ వరకు పటిష్టంగా నిర్మాణాలు జరగాలన్నారు‌ ఆయన . ప్రభుత్వ చేపట్టే కార్యక్రమాలు ప్రజల వద్దకు వెళ్లాలంటే కార్యకర్తలు పటిష్టంగా ఉండాలన్నారు కేటీఆర్‌.

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నూతన పోలీసు కార్యాలయం సమీపంలో TRS పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి మంత్రి జగదీశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. వచ్చే విజయదశమి నాటికి నిర్మాణ పనులు పూర్తిచేసి భవనాన్ని ప్రారంభిస్తామన్నారు ఆయన. అటు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ ఆధ్వర్యంలో.. కరీంనగర్‌ సమీపంలోని కొత్తపల్లి మండలం చింతకుంటలో TRS జిల్లా కార్యాలయ భూమి పూజ జరిగింది. పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టి పిలుపునిచ్చారు మంత్రి ఈటెల. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి చేరవేయాలని కార్యకర్తలకు సూచించారు.

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో TRS పార్టీ కార్యాలయ భూమి పూజ నిర్వహించారు ‌. ఎంపీ మన్నె శ్రీనివాస్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి, లక్ష్మారెడ్డితో కలిసి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ శంకుస్థాపన చేశారు. సీఎం కేసీఆర్‌ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు శ్రీనివాస్‌ గౌడ్. నిర్మల్‌ జిల్లా సారంగపూర్‌ మండలం చించోలి-బి గ్రామంలో TRS పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, ముధోల్‌ ఎమ్మెల్యే విఠల్‌ రెడ్డితో శంకుస్థాపన చేశారు. ఎకరం స్థలంలో నిర్మించనున్న భవనానికి 60 లక్షల రూపాయలు కేటాయించినట్టు తెలిపారు మంత్రి. హరితహారం కార్యక్రమంలో భాగంగా ముందుగా మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో TRS పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ కోరం కనకయ్య భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, రేగా కాంతారావు, హరిప్రియ, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణతోపాటు కొత్తగా ఎన్నికైనా ZPTCలు, MPTCలు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుందని ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీ ఇన్‌చార్జి నూకల నరేష్‌ స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్‌ రోడ్‌ వీటి కాలనీ బస్టాండ్‌ వద్ద TRS పార్టీ కార్యాలయ భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌ రెడ్డి, ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి జిల్లా TRS పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి శంషాబాద్‌లో భూమి పూజ నిర్వహించారు. జెడ్పీ చైర్మన్‌ తీగల అనితారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జిల్లా ఎమ్మెల్యేలు ప్రకాష్‌గౌడ్‌, అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అటు నాగర్‌ కర్నూల్‌జిల్లా కేంద్రంలో TRS జిల్లా కార్యాలయం భూమి పూజను జెడ్పీ చైర్మన్‌ పద్మావతి నిర్వహించారు. కార్యకర్తలందరికీ పార్టీ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నట్టు తెలిపారు పద్మావతి.

Next Story

RELATED STORIES