కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేరికపై పునరాలోచనలో పడ్డ బీజేపీ

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేరికపై పునరాలోచనలో పడ్డ బీజేపీ

ఊహించని రీతిలో మెజారిటీ సాధించి రెండోసారి దేశం పగ్గాలు చేపట్టింది బీజేపీ.. అదే సమయంలో ఇప్పటి వరకు పెద్దగా పట్టు లేని రాష్ట్రాల్లోనూ అనూహ్య విజయం సాధించింది. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో దేశం మొత్తం పాగా వేసేందుకు పావులు కదుపుతోంది. ఇతర పార్టీల్లో ఉన్న అసంతృప్తి నేతలను తమవైపు తిప్పుకుంటోంది. ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న టీడీపీని టార్గెట్‌ చేస్తుంటే.. తెలంగాణలో కాంగ్రెస్‌ టార్గెట్‌గా ఆపరేషన్‌ ఆకర్ష్‌కు తెరతీసింది.. ఏపీలో టీడీపీ నుంచి ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీ తీర్థం పుచ్చుకోగా.. తాజాగా అంబికా కృష్ణ కూడా బీజేపీ గూటికి చేరారు. మరికొద్దిరోజుల్లోనే మరింత మంది టీడీపీ ఎమ్మెల్యేలను మూకుమ్మడిగా పార్టీలో చేర్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ చేరికల వ్యవహారాన్ని రామ్‌ మాధవ్‌ స్వయంగా చక్కబెడుతున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో కాంగ్రెస్‌ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది.. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోగా.. మిగిలిన వారిలో ఎంత మంది ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో కాంగ్రెస్‌పై గుర్రుగా వున్న వారందరినీ తమ పార్టీలో చేర్చుకుంటోంది బీజేపీ. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి బీజేపీ అగ్రనేతల టచ్‌లో వున్నారు. రేపో మాపో ఆయన కాషాయ కండువా కప్పుకోవచ్చు. ఇక్కడే బీజేపీ అధిష్ఠానం ఆచితూచి అడుగులు వేస్తోంది.. పార్టీలోకి వచ్చే వారందరికీ కండీషన్లు పెడుతోంది.. తమ కట్టుబాట్లకు అంగీకరిస్తేనే చేరికలు అంటోంది.

ఇప్పటికే బీజేపీ తీర్థం పుచ్చుకున్న అనేక మంది నేతలకు పార్టీలో స్వేచ్ఛ కరువైనట్లుగా తెలుస్తోంది.. గతంలో పార్టీ అంతర్గత స్వేచ్ఛపై మీడియా ముందు బహిరంగంగానే మాట్లాడే నేతలంతా బీజేపీలోకి వెళ్లాక సైలెంట్‌ అయిపోయారు. నెలల తరబడి మీడియా ముందుకు కూడా రాని నేతలు చాలా మందే ఉన్నారు. ఇదే తరహాలో ఇకముందు పార్టీలోకి వచ్చే వారందరికీ కండీషన్లు పెడుతున్నారు అధిష్ఠానం పెద్దలు. గుర్తింపు ఉంటుందంటూనే పదవుల కోసమే అయితే పార్టీలో చేరొద్దని సలహా ఇస్తున్నారు. ప్రభుత్వాన్ని ఎదుర్కొని నిలబడ్డాకే పదవుల గురించి ఆలోచించాలని అంటున్నారు. దీంతో బీజేపీ కండువా కప్పుకునేందుకు సిద్ధపడ్డ ఎంతో మంది నేతలు అధిష్ఠానం సిద్ధాంతాలతో ఏమేరకు సర్దుకుపోగలమన్న దానిపై తర్జనభర్జన పడుతున్నారు. ఒకట్రెండు రోజుల్లో టీటీడీపీకి చెందిన ముఖ్యనేతలు పెద్దిరెడ్డి, చాడా సురేష్‌, బోడ జనార్దన్‌ సహా పలువురు బీజేపీలో చేరబోతున్నారని తెలుస్తోంది.. అయితే, వీరి వెంట వచ్చేవారు మాత్రం ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నట్లు సమాచారం.

మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరికపై ఆ పార్టీ అధిష్ఠానం పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది.. పార్టీలో చేరకముందే ఆయన మాట్లాడినట్లుగా చెబుతున్న ఆడియో టేప్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వ్యవహారంపై బీజేపీలో పెద్ద చర్చే నడుస్తోంది.. పదవులు ఆశించి, పార్టీని బద్నాం చేసే కార్యక్రమాలు చేసే వారిని పార్టీలోకి ఆహ్వానించడం వల్ల నష్టమే ఎక్కువగా ఉంటుందనేది బీజేపీ అధిష్ఠానం పెద్దల అభిప్రాయం. తద్వారా బీజేపీలో చేరాలనుకునే ఎంత పెద్ద నేత అయినా కట్టుబాట్లు పాటించాల్సిందేనని చెప్పకనే చెబుతున్నారు. మరి, ఈ కట్టుబాట్లు బీజేపీకి ప్రతిబందకాలుగా మారుతాయా..? వేచి చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story