వైసీపీ వర్గీయుల దుశ్శాసన పర్వం.. అవమాన భారంతో మహిళ ఆత్మహత్య

వైసీపీ వర్గీయుల దుశ్శాసన పర్వం.. అవమాన భారంతో మహిళ ఆత్మహత్య

ప్రకాశం జిల్లాలో వైసీపీ, టీడీపీ వర్గాల ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. చినగంజాం మండలం రుద్రమాంబపురంలో ఇవాళ జరిగిన గొడవలో ఓ మహిళ ప్రాణాలు ప్రాణాలు కోల్పోయింది. ఇవాళ ఉదయాన్నే టీడీపీ మద్దతుదార్లపై వైసీపీ వర్గీయులు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. పద్మ అనే మహిళను తీవ్రంగా కొట్టారు. వివస్త్రను చేసేందుకు ప్రయత్నించారు. ఈ దుశ్శాసన పర్వంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. అవమానం భారంతో ఉరి వేసుకుని చనిపోయింది.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచే రుద్రమాంబపురంలో యుద్ధవాతావరణం నెలకొంది. ఇవాళ తెల్లవారుజామున ఓ విషయంలో మొదలైన గొడవ.. క్షణాల్లోనే పెద్దదైపోయింది. వైసీపీ వర్గీయులు విచక్షణా రహితంగా కర్రలు, రాళ్లతో ఎటాక్‌ చేశారు. మహిళల్ని కూడా దారుణంగా కొట్టారు. దీన్ని ప్రతిఘటిస్తూ తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఎదురు దాడికి దిగారు. ఐతే.. ప్రత్యర్థులు మహిళలు టార్గెట్‌గా దాడి చేయడం, పదిమంది మందు ఓ మహిళ బట్టలు విప్పేందుకు ప్రయత్నించడం పట్ల టీడీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్మ సూసైడ్‌కి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

తమ ఇళ్లపై దాడులు చేసి తమ ప్రాణాలు తీసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వైసీపీ వర్గీయులపై టీడీపీ కార్యకర్తలు కేసు పెట్టారు. ఇంతలోనే మహిళ సూసైడ్ విషయం కూడా తెలియడంతో పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. స్థానికులు తప్ప ఇతరులు ఎవ్వరినీ ఊళ్లోకి అనుమతించడం లేదు. పరిస్థితి సద్దుమణిగే వరకూ పికెట్ కొనసాగించాలని నిర్ణయించారు. అవసరమైతే అదనపు బలగాలను పంపేందుకు అంతా సిద్ధం చేశారు. అటు, దాడి ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టారు.

Tags

Read MoreRead Less
Next Story