కూలీ కూతురు ఎంపీగా లోక్‌సభలో..

కూలీ కూతురు ఎంపీగా లోక్‌సభలో..

కృషి, పట్టుదల అంతకు మించి ఆత్మవిశ్వాసం.. గేలి చేసిన వారిపైనే గెలిచి చూపించగల సత్తా. ఆమె ఏం చేస్తుందిలే అనుకునే వారికి మాటలతో కాదు చేతల ద్వారా చేసి చూపిస్తానని వాగ్ధానం చేసి ప్రజలకు చేరువయ్యారు. ప్రజల మనసుని గెలుచుకున్నారు. ప్రత్యర్థిపై లక్షన్నర ఓట్ల మెజారిటీతో గెలిచి పార్లమెంట్‌లోకి అడుగుపెట్టారు. ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కేరళలో కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో నిల్చిన ఏకైక మహిళా అభ్యర్ధి.. కమ్యూనిస్టుల కంచు కోట అయిన అలత్తూర్ నియోజక వర్గంలో కాంగ్రెస్‌ను గెలిపించిన ఘనత ఆమెకి దక్కుతుంది.

టికెట్ ఇస్తానన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని తప్పుపట్టింది కాంగ్రెస్ నాయకత్వం. అయినా ఆయనకు రమ్యా హరిదాస్ మీద నమ్మకం. ఆమే సరైన అభ్యర్థి అని. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయలేదు. గెలుపు భారం ఆయన భుజాల మీద వేయలేదు. ప్రజలతో మమేకమై, ప్రజల అవసరాలను తెలుసుకుంటూ, ప్రజల కోసం అహర్నిశలు శ్రమించే నాయకురాలిగా ఉంటానని ప్రజల హృదయాల్లో చోటు సంపాదించారు. తనకు వచ్చిన పాట ద్వారా మరింత దగ్గరయ్యారు. మంచి వాక్చాతుర్యము కూడా ఉన్న రమ్య ప్రజా సమస్యలపై స్పందించే తత్వమే రాహుల్ దృష్టి ఆమె మీద పడేలా చేసింది.

రమ్యది నిరుపేద దళిత కుటుంబం. నాన్న దినసరి కూలీ. అమ్మకి కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం. ఆమె ఆలిండియా మహిళా కాంగ్రెస్‌లో పని చేశారు. చిన్నప్పుడు మీటింగులకు అమ్మతో పాటు వెళ్లేది. ఓ పక్క చదువుకుంటూనే, మరోపక్క కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. అందుకు తల్లి ప్రోత్సాహం తోడయ్యేది. కాలేజీలో యూనియన్ లీడర్‌గా సెలక్టయి రాజకీయ లక్షణాలను అలవరుచుకున్నారు రమ్య. రాజకీయ అండదండలు ఏమీ లేకపోయినా తన స్వశక్తిని నమ్ముకుని, నాయకత్వ లక్షణాలను అలవర్చుకున్న రమ్య కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ మనసునీ గెలుచుకున్నారు. రమ్య నాయకత్వ లక్షణాలను ప్రశంసిస్తూ తన ఫేస్‌బుక్ పేజీలో ఒక వీడియో పోస్ట్ చేశారు ప్రియాంకా గాంధీ.

ఆదివాసీలు, దళితుల సమస్యలపై పోరాడి ప్రజల్లో పేరు తెచ్చుకున్నారు రమ్య. కున్న మంగళం పంచాయితీ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. మంచి వాగ్ధాటి, ప్రజా సమస్యలపై అవగాహన, సృజనాత్మకత, పోరాడేతత్వం ఉన్న రమ్య పార్టీకి ఉపయోగపడతారని భావించిన రాహుల్ మూత్ కాంగ్రెస్ నేషనల్ కో-ఆర్డినేటర్‌గా బాధ్యతలు అప్పజెప్పారు. అక్కడి నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కింది.

కమ్యూనిస్టులకు కంచుకోట అయిన అలత్తూర్ నియోజకవర్గం నుంచి సీపీఐ (ఎం)కు చెందిన పీకే బిజూ2009, 2014లో గెలిచారు. అలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ గెలుపుని ఆశించలేదు పార్టీ. అయినా రమ్య తన ఎంపికను ఛాలెంజింగ్‌గా తీసుకుంది. నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ, ప్రజల అవసరాలు తెలుసుకుంది. ప్రచారానికి డబ్బులు లేకపోతే క్రౌడ్ ఫండింగ్ ద్వారా విరాళాలు సేకరించింది. పెన్షన్ డబ్బులో కొంత, వైద్యం కోసం దాచుకున్న డబ్బుల్లో కొంత ఇలా ఇచ్చి తనను గెలిపించిన ప్రజల్ని ఎప్పటికీ మర్చిపోనంటున్నారు రమ్య. ఎంపీగా నాజీతం అలత్తూర్ ప్రజల కోసమే ఖర్చు చేస్తానంటున్నారు.

తమకు పోటీయే కాదని భావించిన రమ్యకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ లీడర్ ఒకరు రమ్యను కించపరిచేలా అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. వాటిపై స్పందించిన రమ్య ఎప్పుడు మహిళల భద్రత గురించి మాట్లాడే నాయకులు.. ఈ విధంగా మాట్లాడి వారి స్థాయిని దిగజార్చుకోకూడదు అంటూ ఎదురు దాడికి దిగారు. దీంతో రమ్యను విమర్శించిన లీడర్‌పై పోలీసులు కేసు పెట్టారు. లీడర్ దిగి వచ్చి రమ్యకు క్షమాపణలు కూడా చెప్పారు. అయితే అప్పటికే అక్కడ కమ్యూనిస్టు పార్టీకి జరగాల్పిన నష్టం జరిగిపోయింది. ప్రత్యర్థి నాయకుడు పీకే బీజూపై లక్షన్నర ఓట్ల మెజారిటీతో రమ్య గెలుపొందారు. కేరళ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన తొలి దళిత ఎంపీగా కొత్త రికార్డుని సృష్టించారు రమ్య. ఇది తానొక్కరి విజయం కాదని.. తనని ఎన్నుకున్న ప్రజలందరి విజయం అని వినమ్రంగా చెబుతారు ఎంపీ రమ్య.

Tags

Read MoreRead Less
Next Story