కొన్నింటికి లాజిక్‌లు ఉండవ్.. బండరాయికి, పెళ్లికి సంబంధం ఏంటి?

కొన్నింటికి లాజిక్‌లు ఉండవ్.. బండరాయికి, పెళ్లికి సంబంధం ఏంటి?

చిత్తూరు జిల్లా అంటేనే పుణ్యక్షేత్రాలకు పెట్టింది పేరు. తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం, గుడిమల్లాం లాంటివి బాగా ప్రసిద్ధి. పాపులర్ కాని ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయమే పెండ్లి కనుమ గంగమ్మ గుడి.

కొన్నింటికి లాజిక్‌లు ఉండవ్. బండరాయికి, పెళ్లికి సంబంధం ఏంటి? ఒకవేళ గుండు ఎత్తే బలం, నైపుణ్యం లేకపోయినా మ్యారేజ్‌ ఎలా అవుతుంది? ఈ విషయంపై ఎంత ఆలోచించినా బుర్రకు తట్టదు. కానీ.. ముదురు బెండకాయలుగా మారిపోతున్న పెళ్లి కాని యువకులు.. ఈ గుడికి వస్తున్నది నిజం. బండరాయిని పైకెత్తుకున్నాక పెళ్లిళ్లు జరుగుతున్నది కూడా అంతే వాస్తవం.

చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలం మోటమల్లెల పంచాయితీలో ఉంది పెండ్లి కనుమ. గంగమ్మ గుడి దగ్గర బండరాయిని పైకెత్తితే పెళ్లి అవుతుందని నిన్న, మొన్న, ఏ సోషల్‌ మీడియాలోనో మొదలైన ప్రచారం కాదిది. అనాదిగా వస్తున్న ఆచారం. 300 ఏళ్లుగా ఈ ఆచారం కొనసాగుతోందని గ్రామస్తుల మాట. ఇక్కడి గంగమ్మకు సంబంధించి ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. మోటుమల్లెల గ్రామంలో కొండప్పనాయుడు నిద్రిస్తుండగా పెండ్లి గంగమ్మ కలలో కనిపించి.. మీ ఊరిలో వెలిశాను. ఆలయం నిర్మించమని చెప్పిందట. బండరాళ్ల ప్రత్యేకత ఏంటో చెప్పిందట. కొండప్పనాయుడు నిద్రలేచి చూడగా.. ఊరి మధ్యలో అమ్మవారి విగ్రహం, రెండు రాళ్ళు కనిపించాయి. అలా స్వయంభుగా వెలిసిన అమ్మవారికి వెంటనే ఆలయం నిర్మించారు. అప్పటి నుంచి నరసింహులు నాయుడు, రామలక్ష్మ నాయుడు, జయచంద్ర నాయుడు ఇలా దాతలు ఆలయాన్ని నడుపుతూ వస్తున్నారు.

పెండ్లి గంగమ్మకు దండం పెట్టి.. బండరాయి పైకెత్తితే ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయని గ్రామస్తుల విశ్వాసం. అంతే కాదండోయ్ పిల్లలు పుట్టని వారికి సంతానం కలగడం, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోతాయని కూడా చెప్తున్నారు.

ఈ గంగమ్మకు ఏటా ఘనంగా జాతర నిర్వహిస్తారు. చుట్టుపక్కల గ్రామాల వారు, గతంలో బండరాయి పైకెత్తి ఫలితం పొందిన వారు పెద్దసంఖ్యలో వస్తుంటారు. తమిళనాడు నుంచీ భక్తులు వస్తారు. ఈ నెలాఖర్లో, ఆదివారం రోజు జాతర జరగనుంది.

Tags

Read MoreRead Less
Next Story