ఐటీ నగరం ముంబైలా మునిగిపోవాల్సిందేనా?

ఐటీ నగరం ముంబైలా మునిగిపోవాల్సిందేనా?

హైదరాబాద్ లో రోజంతా కుండపోత కురిస్తే ఏంటి పరిస్థితి? ముంబైలా మునిగిపోవాల్సిందేనా? మొదటి వర్షానికే GHMC చేతులెత్తేస్తే.. వర్షాకాలమంతా ఎలా గడవాలి? ముంపు సమస్యకు పరిష్కారం ఏంటి? కిర్లోస్కర్ కమిటీ సూచనలు ఎందుకు బుట్టదాఖలయ్యాయి? కబ్జా కోరల్లో చిక్కుకున్న నాలలు, చెరువులను ఇక రక్షించకోలేమా?

హైదరాబాద్ నగరం ఓ కాంక్రీట్ జంగిల్. ఖాళీ స్థలం కనిపించడమే గగనం. ఇక పచ్చదనాన్నైతే బూతద్దంలో వెతుక్కోవాల్సిందే. గ్రేటర్ పరిధిలో రోజూ వచ్చే మురుగు నీటిని తరలించేందుకే సరైన వ్యవస్థ లేదు. ఇక వానొచ్చి.. వరదొస్తే .. ఆ నీరంతా ఎక్కడికి వెళ్లాలి.? మట్టినేల లేదు కాబట్టి భూమిలోకి ఇంకడం కష్టం. అలాగని నాలాల ద్వారా చెరువుల్లోకి వెళ్లే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే సిటీ చుట్టుపక్కల ఉన్న గొలుసుకట్టు చెరువులన్నింటినీ ఎప్పుడో ధ్వంసం చేశారు. ఇప్పుడు నగర శివార్లలో ఆకాశంతో పోటీపడుతూ వెలిసిన పలు ఎత్తైన అపార్ట్ మెంట్లు... ఒకప్పుడు నీటితో కళకళలాడిన చెరువులే అంటే నమ్మగలరా.?

ఐటీ కారిడార్ మునిగిపోతోందని అధికారులంతా ఇప్పుడు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. కానీ అసలు సమస్య ఎక్కడుందనేది మాత్రం పట్టించుకోవడం లేదు. ఒకప్పుడు మాదాపూర్‌, కొండాపూర్‌, గచ్చిబౌలి, మియాపూర్‌ ప్రాంతాల్లో గొలుసు కట్టు చెరువులు ఉండేవి. వర్షపు నీరు నాలాల నుంచి ఒక్కో చెరువుకు చేరేది. జూబ్లీహిల్స్‌ పెద్దమ్మగుడి, అంబేద్కర్‌ యూనివర్సిటీ, నవాబ్‌గుట్ట ప్రాంతాల నుంచి వచ్చే వరద నాలల ద్వారా నేరుగా దుర్గం చెరువులోకి వెళ్లేది. ఒకప్పుడు 40అడుగులు ఉండే ఈ నాలా ప్రస్తుతం 6 అడుగులకు పరిమితమైంది. ఈ ప్రాంతంలోని మరిన్ని నాలాలు కూడా అసలు ఉనికిలోనే లేకుండా పోయాయి. అందుకే చిన్నపాటి వర్షానికే ఐటీ కారిడార్ ను వరద రౌండప్ చేసేస్తోంది..

తిలాపాపం తలాపిడికెడు అన్నట్లు..నాలాలు, చెరువుల కబ్జాపర్వంలోనూ తలో చేయి వేశారు. రాజకీయాలు, ఓట్లు, ఇతరత్రా కారణాలవల్ల ప్రభుత్వమూ చూసిచూడనట్లు వ్యవహరించింది. అలా ఏళ్ల తరబడి కొనసాగిన కబ్జాల ఫలితమే నేటి దురవస్థకు కారణం..

గత కొంతకాలంగా ప్రభుత్వం నాలాల ఆక్రమణల సమస్యపై సీరియస్‌గా దృష్టి పెట్టింది. అయినా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. గతంలోవేసిన పలు కమిటీలు ఇచ్చిన నివేదకలను ఎవరూ పట్టించుకున్న పాపాన పోవడం లేదు. 2000 సంవత్సరంలో నగరంలో కురిసిన భారీ వర్షాలకు హుస్సేన్‌సాగర్‌ పరీవాహక ప్రాంతాలు నీట మునిగాయి. సమస్య పరిష్కారానికి వెంటనే కిర్లోస్కర్‌ కమిటీ వేశారు. దాదాపు ఏడాది అధ్యయనం చేసిన కమిటీ.. నాలాలు ఎక్కడెక్కడ ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి.? ఆక్రమణలు, వాటి తొలగింపునకయ్యే వ్యయంపై రిపోర్ట్ ఇచ్చింది. ఆ తర్వాత స్వచ్ఛ కమిటీ వేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత మరో సర్వే కూడా చేయించారు. కానీ ఇంత వరకు చర్యలు తీసుకున్న దాఖలాలు మాత్రం లేవు..

ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో నాలాల వెంట 20వేలకుపైగా ఆక్రమణలు ఉన్నాయి. వీటిన్నింటినీ తొలగించి పునరావాసం కల్పించాలంటే వందల కోట్లు అవసరం. ఇక కొన్ని ప్రాంతాల్లో నాలాలను 50 నుంచి 60 అడుగుల మేర విస్తరించాలి. ఇదంత సులభం కాదు. సరిపడా నిధులను కేటాయించి..పక్కా ప్లాన్ తో ముందుకెళ్తేనే కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది. ఇందులోనూ ఎలాంటి రాజకీయ జోక్యాలకు తలొగ్గకుండా కఠినంగా వ్యవహరించాలి. అప్పుడే నాలాలు కనిపిస్తాయి.. చెరువులు కళకళ లాడుతాయి..

భాగ్యనగరవాసులను వరద గండం నుంచి తప్పించాలంటే బల్దియా తక్షణమే కొన్ని చర్యలు తీసుకోవాలి..రోడ్లపై నీరు నిలువకుండా.. చినుకుపడగానే కాలువలోకి వెళ్లేలా ఏర్పాట్లు చేయాలి. నాలాల్లో పేరుకున్న చెత్తా చెదారం, పూడికను ఎప్పటికప్పుడు తొలగించాలి. డ్రైనేజీ మ్యాన్‌హోల్స్‌ నుంచి మురుగు బయటకు రాకుండా చూడాలి. రహదారులు పల్లంగా ఉండే ప్రాంతంలో కాలువలను నిర్మించి వరదనీటిని మళ్లించాలి. డిజాస్టర్ రెస్పాన్స్ టీముల సంఖ్యను పెంచాలి. వర్షం పడిన వెంటనే స్పందించి ట్రాఫిక్ క్లియర్ చేయాలి. ఐటీ కారిడార్‌కి ప్రజా రవాణాను మరింత మెరుగుపరచాలి. వారంలో ఒకరోజు కార్ ఫ్రీ డే పాటించేలా ఉద్యోగుల్లో అవగాహన కల్పించాలి..

ప్రస్తుతం విశ్వనగరంగా చెప్పుకొంటున్న భాగ్యనగర దుస్థితికి ఒక ప్రభుత్వాన్నే తప్పుపడితే సరిపోదు. పౌరులు కూడా బాధ్యతగా వ్యవహరించాలి. నాలాలు, చెరువుల్లో నిర్మించిన అక్రమకట్టడాల కూల్చివేతకు సహకరించాలి. నాలాలు, చెరువుల్ని కాపాడుకోవాలి. లేదంటే భాగ్యనగరం ముంబైలా మునిగిపోయే రోజులు ఎంతో దూరం లేవు. వరదకు సైడిస్తే కామ్ గా వెళ్లిపోతోంది. లేదంటే ఉప్పెనలా మారి నగరాన్ని ముంచేస్తుంది..

Tags

Read MoreRead Less
Next Story