జ్ఞాపకాల నీడను మిగిల్చి.. తోడును వదిలి..

జ్ఞాపకాల నీడను మిగిల్చి.. తోడును వదిలి..
X

విజయ నిర్మల.. సూపర్ స్టార్ కృష్ణ భార్యగానే కాదు.. ప్రపంచ ఖ్యాతి గాంచిన దర్శకురాలిగానూ తనకంటూ ఓ అరుదైన వ్యక్తిత్వాన్ని అస్తిత్వాన్ని సొంతం చేసుకున్న ధీరమహిళ. హీరో కృష్ణ సూపర్ స్టార్ గా ఎదగడంలోనూ ఆమె కృషి ప్రత్యేకమైనది. నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగానూ రాణించిన అతి కొద్దిమంది మహిళామణుల్లో ఒకరు విజయ నిర్మల. పురుషాధిక్య పరిశ్రమలో ఓ మహిళగా తనదైన ముద్ర వేయగలడం అంత సులభం కాదు. ప్రతి విషయంలో డైనమిక్ గా ఉన్న విజయ నిర్మల అడుగుపెట్టిన అన్ని రంగాల్లోనూ అనితర సాధ్యమైన విజయాలు అందుకున్నారు.

బాలనటిగా 'పాండురంగ మహత్యం' సినిమా తో వెండితెరపై అడుగు పెట్టిన విజయ నిర్మల తెలుగు, తమిళ సినిమాల్లో బాలనటిగా నటించారు. భార్గవనిలయం సినిమాతో మళయాలంలో, రంగుల రాట్నం సినిమాతో తెలుగులో హీరోయిన్ గా మారారు . అయితే మళయాలంలో హీరోయిన్ గా నటిస్తోన్న విజయ నిర్మలను చూసి దర్శకుడు బిఎన్ రెడ్డిగారు తెలుగులో రంగులరాట్నం సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు ..

విజయ నిర్మల వంటి నటీమణులు అత్యంత అరుదుగా కనిపిస్తారు. నటిగా తిరుగులేని ముద్ర వేసిన ఆమె దర్శకురాలిగానూ అఖండ విజయాలు అందుకున్నారు. మామూలుగా మహిళా దర్శకులు సున్నితమైన కథలనో లేక స్త్రీ పక్షపాత కథలనో డైరెక్ట్ చేశారు.. విజయ నిర్మల కంటే ముందు ఈ విభాగంలో అడుగుపెట్టిన భానుమతి, సావిత్రి దర్శకత్వంలో ఇలాంటి కథలే వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళా దర్శకులు కూడా ఎక్కువ శాతం ఇదే చేశారు. కానీ విజయ నిర్మల అలాంటి కథలతో పాటు.. కంప్లీట్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ నూ చేశారు. అప్పటి కమర్షియల్ డైరెక్టర్స్ కు ఏమాత్రం తీసిపోని విధంగా విజయాలూ అందుకున్నారు. ఇదే ఆమెకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించి పెట్టిందంటే అతిశయోక్తి కాదు.

కృష్ణ విజయ నిర్మల కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ చాలా పెద్దది. వీరిద్దరూ కలిసి యాభైకి పైగా సినిమాల్లో నటించారు. ఆమె 44 చిత్రాలకు దర్శకత్వం వహిస్తే 25 సినిమాల్లో హీరోగా నటించింది కృష్ణగారే. దర్శకురాలిగా సాహసంలో ఆమె భర్తకు తగ్గ భార్య అనిపించుకున్న సినిమా దేవదాసు. ఇదో మాస్టర్ పీస్ అని.. ఇంకెవరూ ఈ కథను టచ్ చేయలేరని ఎందరో దర్శకులు ఫీలైన తరుణంలో ఆమె ఆ కథను మళ్లీ డైరెక్ట్ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా రీమేక్ చేసి మళ్లీ విజయం అందుకున్న ధైర్యం ఆమె సొంతం.

ఓ నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా విజయ నిర్మల ఎంతో మంది మహిళలకు ఆదర్శవంతమైన పాత్ర పోషించింది. మొత్తంగా కృష్ణ, విజయ నిర్మల జంట అంటే పరిశ్రమలో ఎందరికో ఇష్టం. ఈ మధ్య మా ఎలక్షన్స్ లోనూ ఉత్సాహంగా కనిపించిన ఆమె ఇలా హఠాత్తుగా కన్నుమూయడం పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇన్నాళ్లూ కృష్ణగారి జీవితంలో ఎన్నో విధాలుగా అండగా ఉన్న ఆమె.. ఆయనకు తమ జ్ఞాపకాల నీడను మాత్రం మిగిల్చి తన తోడును వదిలి వెళ్లిపోయారు.

Next Story

RELATED STORIES