అబ్బూరి ఛాయాదేవి కన్నుమూత

అబ్బూరి ఛాయాదేవి కన్నుమూత

ప్రముఖ తెలుగు రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి ఇక లేరు. ఆమె శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారు. మహిళా ఆభ్యుదయవాదిగా ఆమె రచనలు చేశారు. 1953లో నిజాం కాలేజీ మ్యాగ్‌జైన్‌లో ఛాయాదేవి రాసిన అనుభూతి కథ తొలిసారి ప్రచురితమైంది. అప్పటి నుంచి ఛాయాదేవి చాలా వరకు మధ్య తరగతి కుటుంబాలలోని మహిళలు ఎదుర్కొనే సమస్యల గురించి, పురుషాధిక్యతకు లోబడిన స్త్రీల పరిస్థితుల గురించి చాలా కథలు రాశారు. ఆమె రాసిన కొన్ని కథలు హిందీ, తమిళ, మరాఠి, కన్నడ భాషలలోకి అనువదించారు.

ఛాయదేవి కథల్లో బోన్‌సాయ్ బ్రతుకు, ప్రయాణం సుఖాంతం, ఆఖరికి ఐదు నక్షత్రాలు, ఉడ్‌రోజ్ కథలు చాలా ప్రసిద్ధిపొందాయి. ఆడపిల్లల పెంపకంలోనూ చూపిస్తూ వారి బతుకుల్ని బోన్ సాయ్ చెట్టులా ఎదగనివ్వడం లేదని చెప్పే కథ బోన్‌సాయ్ బ్రతుకు. ఈ కథని 2000 సంవత్సరంలో ఆంధ్రపదేశ్ ప్రభుత్వం 10వ తరగతి తెలుగు వాచకంలో చేర్చింది. ఛాయాదేవి రచనలకు 1993లో వాసిరెడ్డి రంగనాయకమ్మ సాహిత్య పురస్కారం, 1996లో మృత్యుంజయ పుస్తకానికి తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఉత్తమ రచయిత్రి అవార్డు అందుకున్నారు. 2000 ఏడాదిలో కళాసాగర్ పందిరి సాహితీ పురస్కారాలు అందుకున్నారు. ఇక, 2005లో -తనమార్గం- కథాసంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకున్నారు. అబ్బూరి ఛాయదేవి రచనల్లో ఒక్కటైనా సుఖాంతం అనే కథ నేషనల్ బుక్ ట్రస్ట్‌కు చెందిన కథాభారతిలో 1972లో ప్రచురించబడింది.

అబ్బూరి ఛాయదేవి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా రాజమమండ్రిలో 1933 అక్టోబర్ 13వ తేదీన జన్మించారు. నిజాం కాలేజీలో బీఏ పూర్తి చేశారామె. న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో డిప్యూటీ లైబ్రేరియన్‌గా పనిచేసిన ఛాయాదేవి 1982లో స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు. ఆమె మృతి తెలుగు సాహిత్యానికి తీరని లోటు. ఆమె మరణవార్త తెలుగు సాహిత్య లోకాన్ని విషాదంలో ముంచింది.

Tags

Read MoreRead Less
Next Story