కృష్ణా కరకట్టపై అక్రమ కట్టడాలు.. నోటీసులు ఇచ్చింది వీరికే..

కృష్ణా కరకట్టపై అక్రమ కట్టడాలు.. నోటీసులు ఇచ్చింది వీరికే..

ఏపీ సీఎం జగన్‌ చెప్పినట్టుగానే.. ఏపీలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలపై ప్రభుత్వం దృష్టిసారించింది. ముఖ్యంగా రాజధాని ప్రాంతం.. కృష్ణానది కరకట్ట అక్రమాల కూల్చివేతకు యాక్షన్‌ ప్లాన్‌ రెడీ అయ్యింది. కరకట్ట వెంట అక్రమంగా నిర్మించిన కట్టడాలపై సీఆర్డీఏ ఇప్పటికే కొరడా ఝుళిపించింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అద్దెకు ఉంటున్న లింగమనేని ఎస్టేట్స్‌తో సహా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన వాటన్నింటికీ నోటీసులు జారీ చేసింది..

నదీ తీరానికి వంద మీటర్ల లోపు ఉన్నవన్నీ అక్రమ కట్టడాలేనని, వరద నీటి మట్టానికి దిగువన ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఇలాంటి కట్టడాలను 58కి పైగా గుర్తించి వాటిపై సుదీర్ఘ కసరత్తు చేసింది. వీటిలో 28 అక్రమ కట్టడాలకు నోటీసులు ఇచ్చారు సీఆర్‌డీఏ అధికారులు.

బ్యారేజీ దిగువన ఉన్న లోటస్ హోటల్‌తో పాటు ఫిషర్‌మెన్ అసోసియేషన్ భవనం, చందన కేదారేశ్వరరావు గెస్ట్‌హౌస్, శ్రీరెడ్డి గెస్ట్ హౌస్, మాజీ ఎంపీ, బీజేపీ నాయకుడు గోకరాజు గంగరాజుకు చెందిన అతిథి గృహం, సాగర్ మినరల్ వాటర్ ప్లాంట్ పేరిట నిర్మించిన డాక్టర్ సురేంద్రకు చెందిన గెస్ట్‌హౌస్, సత్యానంద ఆశ్రమం, ఆక్వా డేర్ డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు చెందిన హేచరీస్, తులసి గార్డెన్స్, వేదాద్రి మహర్షి తపోవనం, లింగమనేని ఎస్టేట్స్‌కు చెందిన ప్రజావేదిక గ్రౌండ్ ఫ్లోర్, మాగంటి ప్రసాద్, ముక్కామల అప్పారావు గెస్ట్‌హౌస్, సిటీ కేబుల్ మధుసూదనరావు బిల్డింగ్, ఫిట్‌నెస్ సెంటర్ ఓపెన్ ఆడిటోరియం, మందడంలోని ఫిషర్‌మెన్ సెటిల్‌మెంట్ గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు ఇంకా 50 హట్స్, 5 పక్కా భవనాలు, మందడం, తుళ్లూరులోని మరో రెండు అక్రమ కట్టడాలుగా గుర్తించి నోటీసులు అందజేసినట్టు తెలుస్తోంది.

అక్రమ నిర్మాణాలపై వారం లోగా వివరణ ఇవ్వాలన్న సీఆర్‌డీఏ అధికారులు.. సంజాయిషీ సరిగ్గా లేకుంటే వాటిని కూల్చివేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే అక్కడి యజమానాలు మాత్రం తమకు అన్ని అనుమతులు ఉన్నాయనే అంటున్నారు. కొందరైతే తమ గేట్లపై ఇవి అక్రమ నిర్మాణాలు కావు.. అన్ని అనుమతులతో నిర్మించాం.. మా జోలికి రాకండి అంటూ రిటర్న్‌ నోటీసులు పెడుతున్నారు.

ప్రస్తుతం కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో ప్రభుత్వం చేపట్టిన కరకట్ట ఆపరేషన్ అటు రాజకీయ, ఇటు అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది. వీటిపై కొన్ని కోర్టు కేసులు నడుస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందనేది చూడాల్సి వుంది.

Tags

Read MoreRead Less
Next Story