భారీ వర్షం.. ముగ్గురు మృతి

ముంబై మళ్లీ మునిగింది. కుండపోత వర్షాలతో దేశ ఆర్ధిక రాజధాని జలదిగ్బంధమైంది. బాంబేలో ఎక్కడ చూసినా వాన నీరే కనిపిస్తోంది. వీధులు, రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై అడుగుల మేర నీళ్లు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయమేర్పడింది. ట్రాఫిక్ భారీగా నిలిచిపోవడంతో వాహనదారులు నరకం చూశారు.

ఇన్నాళ్లూ భయంకరమైన ఎండలు, భరించలేని ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడిన ముంబై వాసులు, ఇప్పుడు వానలతో నరకం చూస్తున్నారు. నైరుతి రుతుపవనాల ప్రభా వంతో ముంబై అంతటా జోరుగా వర్షాలు పడుతున్నాయి. దాదర్, వడాలా, వర్లీ, కుర్లా, చెంబూర్, బాంద్రా, విల్లేపార్లే, విరార్, జుహూ తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం పడింది. దాంతో ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, వీధులు, రహదారులు మొత్తం నీటితో నిండిపోయాయి.

దాదర్, వర్లీ, కుర్లా, చెంబూర్, బాంద్రా, అంధేరీ, విఖ్రోలీ, కంజుర్మార్గ్ ప్రాంతాల్లో వర్షపు నీరు భారీగా నిలిచి పోయింది. పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. కరెంట్ స్తంభాలు నేలకూలాయి. భారీ వర్షాల కారణంగా రవాణ వ్యవస్థ స్తంభించిపోయింది. రైళ్లు, విమాన సర్వీసులు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. నిజానికి గత 45 ఏళ్లలో తొలిసారి నైరుతి రుతుపవనాలు ముంబైలోకి ఆలస్యంగా ప్రవేశించాయి. జూన్ 10న రావాల్సిన రుతుపవనాలు 17 రోజులు ఆలస్యంగా వచ్చాయి. లేట్‌గా వచ్చినప్పటికీ, రుతుపవనాల జోరు మాత్రం బాగానే ఉంది. భారీ వర్షాల కారణంగా శుక్రవారం ఒక్కరోజే ముంబైలో ముగ్గురు చనిపోయారు. ఐదుగురు గాయపడ్డారు.

ముంబై ప్రజలు తమ కష్టాలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతూ అధికారులపై నిప్పులు చెరుగుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రోడ్లపై నీరు నిలిచిపోతోందని మండిపడుతున్నారు. దాంతో వాటర్ ఉన్న ఏరియాలను తప్పించి, మిగతా రూట్లలో వెళ్లాలంటూ వాహనదారులకు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story