తెలుగు రాష్ట్రాల మధ్య మెరుగుపడుతున్న సంబంధాలు.. నేడు..

తెలుగు రాష్ట్రాల మధ్య మెరుగుపడుతున్న సంబంధాలు.. నేడు..

తెలుగు రాష్ట్రాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి.. ఇరువురు ముఖ్యమంత్రుల సమన్వయంతో ముందుకు సాగుతూ ప్రజల్లో కొత్త ఆశలను చిగురింపజేస్తున్నారు.. ఆంధ్రప్రదేశ్‌ , తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలు పరిష్కంచుకునే దిశగా ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్‌ అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రగతి భవన్‌లో అధికారికంగా సమావేశమైన ఇద్దరు సీఎంలు విభజన సమస్యలతోపాటు, నదీ జలాల పంపకం సహా అనేక అంశాలపై చర్చించారు.. దాదాపు ఐదు గంటల పాటు సమావేశం జరిగింది.

అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సమావేశంలో ఉభయులూ నిర్ణయానికి వచ్చారు. కృష్ణా నదిలో నీటి లభ్యత తక్కువవుతున్న నేపథ్యంలో గోదావరి నీటిని తరలించాలని ఇద్దరు ముఖ్యమంత్రులు నిర్ణయించారు. దీనికి సంబంధించి ప్రణాళిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. నదీ జలాల వినియోగంలో గతంలో ఉన్న వివాదాలను మరిచిపోయి ముందడుగు వేయాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. దీనివల్ల సాగునీటికి తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్న రాయలసీమతోపాటు.. పాలమూరు, నల్గొండ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీటి కష్టాలు తీరతాయన్నారు. తెలంగాణ, ఏపీ రెండూ వేర్వేరు అనే భావన తమకు లేదని.. ఇరు రాష్ట్రాల ప్రజలు బాగుండాలనేదే తమ అభిమతమని వెల్లడించారు.

అటు సమావేశంలో నదుల్లో నీటి లభ్యతపై ముఖ్యమంత్రి కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గోదావరి, కృష్ణా నదుల్లో 4వేల టీఎంసీల నీటి లభ్యత ఉందని.. ఆ నీటిని ఉపయోగించుకుంటే రెండు రాష్ట్రాలు సుభిక్షమౌతాయని కేసీఆర్‌ అన్నారు. బేషజాలు, అపోహలు, వివాదాలు అక్కర్లేదని... వివాదాలే కావాలనుకుంటే మరో తరానికి కూడా మనం నీళ్ళివ్వలేమని పేర్కొన్నారు. పోలవరం నుంచి వేలేరు ద్వారా విశాఖ వరకు నీటిని తీసువెళ్లాలని.. వంశధార, నాగావళి నదుల నీటిని సమర్ధవంతంగా ఉపయోగిస్తే ఉత్తరాంధ్ర వాసుల బాధలు తీరుతాయని తెలంగాణ సీఎం వివరించారు. గూగుల్‌ మ్యాప్‌ల సహకారంతో గోదావరి-కృష్ణా నదుల నీటిని ఎలా వాడుకోవాలో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా సూచించారు.

కేసీఆర్‌ ముందు చూపును ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ అభినందించారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించే కేసీఆర్ అందిస్తున్న సహకారం చాలా గొప్పదని అన్నారు. రెండు రాష్ట్రాలు వేసిన అడుగు దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు.

అటు గోదావరి నుంచి కృష్ణా నదికి జలాల తరలింపుపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కలిసి ఓ కమిటీని ఏర్పాటు చేశాయి. ఈ కమిటీలో ఇరు రాష్ర్టాల అధికారులు, ఇంజినీర్లు సభ్యులుగా ఉంటారు. ఎక్కడి నుంచి ఎలా నీరు తరలించాలన్న విషయమై కమిటీ నివేదిక ఇవ్వనుంది. కమిటీ నివేదిక ఆధారంగా మరోసారి ముఖ్యమంత్రులు ఇద్దరూ సమావేశమై తుది నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు ఉద్యోగుల విభజన, ప్రభుత్వ సంస్థల విభజన తదితర అంశాలపై ఈరోజు ప్రభుత్వ సలహాదారులు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.

Tags

Read MoreRead Less
Next Story