రాహుల్ గాంధీ ఆలోచన మేరకు నేను రాజీనామా చేశా - రేవంత్ రెడ్డి

రాహుల్ గాంధీ ఆలోచన మేరకు నేను రాజీనామా చేశా - రేవంత్ రెడ్డి

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. శుక్రవారం ఒక్కరోజే 145మంది వారి వారి పదవులకు రాజీనామా చేయగా.. ఆదే బాటలో మరికొందరు నేతలు రాజీనామాలకు తెరతీస్తున్నారు. రాహుల్ గాంధీ తన రాజీనామాను ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవికి శుక్రవారం పొన్నం ప్రభాకర్‌ రాజీనామా చేయగా.. శనివారం రేవంత్ రెడ్డి రాజీనామా చేశారు. అటు ఏఐసీసీ కార్యదర్శి పదవికి వీహెచ్‌ రాజీనామా సమర్పించారు.

పార్టీ భవిష్యత్తు ప్రయోజనాల కోసం రాహుల్ తరహాలోనే తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు రేవంత్‌ రెడ్డి తెలిపారు. పార్టీలో పదవి లేకపోయినా కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం మరింత కృషి చేస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అనుసరించాల్సిన వ్యూహంపై నాగార్జున సాగర్‌ వేదికగా టీపీసీసీ కార్యవర్గం సమావేశమైంది. విజయవిహార్‌ గెస్ట్‌ హౌస్‌లో జరుగుతున్న ఈ సమావేశంలో తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి కుంతియా, సీనియర్ నేతలు.. టీపీసీసీ,డీసీసీ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

జనంలో తిరకుండా కేవలం సమావేశాలతో.. ప్రెస్‌ మీట్లతో ఒరిగేదేమి లేదని అన్నారు రేవంత్ రెడ్డి. నిపుణుల కమిటీ అభ్యంతరాలు చెప్పినా కేసీఆర్‌ కాళేశ్వరం కట్టారని.. ఆ నివేదిక చాలు కోర్టును ఆశ్రయించడానికి అని పేర్కొన్నారు. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి కోసం ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందని రేవంత్ స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంపై ఆర్థిక భారం.. అప్పులు వేయడం తప్ప మరొకటి లేదని విమర్శించారు.

రాహుల్ రాజీనామాతో దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఆవేదనలో ఉన్నారని విహెచ్‌ హనుమంతరావు అన్నారు. పార్టీ ఓటమికి రాహుల్ ఒక్కరిదే బాధ్యత కాదు .. ముఖ్య పదవుల్లో ఉన్నవారంతా బాధ్యులే అని పేర్కొన్నారు. కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డిని ఇంతవరకు సస్పెన్షన్ చేయకపోవడం సరికాదని విమర్శించారు. దీన్ని నిరసిస్తూ సమావేశాన్ని బైకాట్‌ చేసినట్లు తెలిపారు విహెచ్‌.

Tags

Read MoreRead Less
Next Story