తండ్రి బాటలోనే తనయుడు.. జులై ఒకటి నుంచి ప్రతి రోజూ గంటపాటు..

పాలనలో తన మార్క్‌ను చూపిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కొత్త కొత్త ఆలోచనలతో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజా దర్బార్‌ అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోవడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. జులై ఒకటి నుంచి ఈ ప్రజా దర్బార్‌ నిర్వహించనున్నారు. ప్రతి రోజూ ఉదయం గంటపాటు సామాన్య ప్రజలను కలిసి వారి ఫిర్యాదులను స్వీకరించనున్నారు.. జగన్‌ ప్రజా దర్బార్‌ కోసం తాడేపల్లిలోని క్యాంప్‌ ఆఫీస్‌లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

వ్యక్తిగత సమస్యలతోపాటు, తమ ప్రాంత సమస్యలు పరిష్కరించాలంటూ వినతి పత్రాలతో ప్రజలు నిత్యం క్యాంప్‌ ఆఫీస్‌ దగ్గరకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అయితే, వీరి నుంచి ఇప్పటి వరకు సీఎంవో అధికారులే వినతిపత్రాలు స్వీకరిస్తున్నారు. నేరుగా ముఖ్యమంత్రికి తమ సమస్యలు చెప్పుకునే అవకాశం లేకపోవడంతో నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వారందరి సమస్యలు స్వయంగా తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి జగన్‌ ప్రజా దర్బార్‌కు శ్రీకారం చుట్టారు. జులై ఒకటి నుంచి ప్రతి రోజూ ఉదయం 8 గంటల తర్వాత గంటపాటు ముఖ్యమంత్రి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుంటారు. ప్రజా దర్బార్‌ ముగిసిన తర్వాతే ముఖ్యమంత్రి జగన్‌ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్‌ఆర్‌ కూడా ప్రజా దర్బార్‌ కార్యక్రమాన్ని నిర్వహించేవారు. సామాన్య ప్రజల కోసం ప్రత్యేకంగా కొంత సమయాన్ని కేటాయించేవారు. తాజాగా తండ్రి బాటలోనే జగన్‌ కూడా పయనిస్తున్నారు. ప్రతి రోజూ గంట సమయాన్ని ప్రజల కోసం కేటాయించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story