అమ్మాయి ఇష్టంలేని ప్రేమపెళ్లి చేసుకోవడంతో..

ప్రేమజంటలపై దాడులు తెలుగు రాష్ట్రాల్లో సంచలన సృష్టిస్తున్నాయి. పరువుకోసం కన్నపేగుపైనే దాడులకు దిగుతున్నారు కుటుంబ సభ్యులు. తాజాగా కృష్ణా జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. కూతురు తమకు ఇష్టంలేని ప్రేమపెళ్లి చేసుకుందని అబ్బాయి ఇంటిపై దాడికి దిగారు అమ్మాయి తరపు బంధువులు. అంతటితో ఆగక వారు ఉంటున్న ఇళ్లును మొత్తం ధ్వంసం చేశారు. అబ్బాయి తల్లిపై దాడి చేశారు.పెనమలూరు మండలం ఉప్పలూరులో ఈ ఘటన జరిగింది.
ఉప్పలూరు గ్రామానికి చెందిన కలపాల రాజ్‌కుమార్, కొండ్రు మౌనిక గత 5సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమపెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో గుంటూరు జిల్లా ఫిరంగిపురంలోని వేలంగిణీమాత ఆలయంలో వివాహం చేసుకున్నారు. కూతురు తమకు ఇష్టంలేని పెళ్లి చేసుకుందని ఆగ్రహించిన కుటుంబ సభ్యులు...ఉప్పలూరులో ఉంటున్న అబ్బాయి ఇంటిపై దాడికి దిగారు. రాజ్‌కుమార్ తల్లిపై దాడి చేశారు. అంతేకాదు ఇంటి పైకప్పు మొత్తం పీకేశారు. ఇంటిలోని వంటగిన్నెలను, వస్తువులను బయటపడేశారు.
అమ్మాయి తరపు కుటుంబ సభ్యుల దాడితో భయభ్రాంతులకు గురైన ప్రేమజంట రక్షణకోసం కంకిపాడు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. తమకు ప్రాణ హాని ఉందని..రక్షణ కల్పించాలని పోలీసులకు కోరారు. ఇంటిపై దాడి ఘటనను ప్రేమజంట ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com