ఏపీలో అన్నదాతల ఆందోళన..

ఏపీలో అన్నదాతల ఆందోళన..

ఏపీలో అన్నదాతలు ఆందోళనబాట పట్టారు. సబ్సీడి విత్తనాల కోసం రోడ్డెక్కి రాస్తారోకో, ధర్నాలకు దిగుతున్నారు. ఖరీప్ సీజన్‌లో వేరుశనగ, పత్తి విత్తనాలతో పాటు ఇతర విత్తనాలు తక్షణమే పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. విత్తుకు పదను దాటిపోతోందని ఇంకెప్పుడు విత్తనాలు పంపిణీ చేస్తారని అధికారులను నిలదీస్తున్నారు రైతులు.

మొన్నటి వరకు చినుకు కోసం ఎదురుచూసిన రైతులు ఇప్పుడు విత్తనాలు దొరక్క విలవిల్లాడుతున్నారు. సాయమో రామచంద్రా అంటూ విత్తనాల కోసం ఆందోళన బాట పడుతున్నాడు. సబ్బిడీ విత్తనాల కోసం ఏపీలో కర్షకులు రోడ్డెక్కారు. విత్తనలు మహాప్రభో అంటూ అధికారులను వేడుకుంటున్నారు. ఐనా ప్రభుత్వం, అధికారులు కనికరించకపోవడంతో ధర్నాలకు దిగుతున్నారు.

అనంతపురం జిల్లాలో సబ్సిడీ విత్తనాల కోసం అన్నదాతలు కదం తొక్కారు. ఖరీఫ్ ప్రారంభమైనప్పటికీ ఇంకా వేరుశెనగ విత్తనాల పంపిణీలో అధికారులు జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. కళ్యాణదుర్గం పామిడి రైతులు రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. అధికారుల అలసత్వం వల్లే ఇలా జరుగుతోందని ..ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని రైతులు డిమాండ్ చేశారు.

చిత్తూరు జిల్లా బి.కొత్తపేటలోనూ విత్తనాల కోసం రైతులు ఆందోళన బాటపట్టారు. 2రోజులుగా పడిగాపులు కాస్తున్నా విత్తనాలు ఇవ్వకుండా వ్యవసాయ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై రైతుల ధర్నాతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వ్యవసాయ అధికారులు, పోలీసులు బుజ్జగించే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకుండా పోయింది.

రైతులకు విత్తనాలు అందకపోవడంపై ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు మాజీ మంత్రి లోకేష్‌.రాష్ట్రంలో రైతులకు సీఎం జగన్‌ విత్తనాలు అందించలేకపోతున్నారని‌ ట్వీట్‌ చేశారు. అలాంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి నీళ్లు తెస్తానంటూ పక్క రాష్ట్ర సీఎంతో చర్చలకు వెళ్లారట అంటూ ఎద్దేవా చేసారు. అనంతపురం, విజయనగరం, నెల్లూరు.. ఇలా రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల 'విత్తనాలో జగన్ గారూ' అంటూ రోడ్డెక్కుతున్నారని వీడియోలను సైతం ట్విట్టర్‌లో పోస్టు చేశారు లోకేష్.

రాజన్న రాజ్యం అంటే విత్తనాలు, ఎరువుల కోసం క్యూలైన్‌లో ఎదురుచూపులు, లాఠీఛార్జ్‌ల్లో దెబ్బలు తినాలని మరోసారి గుర్తుచేశారంటూ లోకేష్‌ విమర్శించారు. ఇప్పటికైనా గత ప్రభుత్వ హయాంలో అవినీతి అంటూ తమపై బురద జల్లే కార్యక్రమాలతో కాలయాపని మానుకోవాలన్నారు. రైతులకు విత్తనాలు అందించే పని మొదలుపెట్టండని సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story