చంద్రబాబు ఫ్లెక్సీలపై వైసీపీ అభ్యంతరం

చంద్రబాబు ఫ్లెక్సీలపై  వైసీపీ అభ్యంతరం

ఇవాళ కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతిపురం మండలంలో చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలను వైసీపీ నాయకులు అడ్డుకోవడంతో వివాదం మొదలైంది. కుప్పం- పలమనేరు జాతీయరహదారి పక్కన.. తెలుగుదేశం నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గత ఐదేళ్లలో తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ ఫ్లెక్సీలు, డిజిటల్‌ బ్యానర్లు పెట్టారు. ఈ విషయం తెలిసిన వైసీపీ కార్యకర్తలు దాన్ని అడ్డుకున్నారు. జగన్ బ్యానర్లకు పోటీగా ఏర్పాటు చేశారంటూ వాటిని తొలగించే ప్రయత్నం చేయడంతో గొడవ మొదలైంది. ఇరువర్గా తోపులాట ఘర్షణతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సమయంలో శాంతిపురంలో YCP నేతలు భారీ ఫ్లెక్సీలు కట్టారు. ఇప్పుడు చంద్రబాబు పర్యటన సందర్భంగా TDP నేతలు పెడుతున్న ఫ్లెక్సీల వల్ల అవి కనిపించడం లేదని వైసీపీ అభ్యంతరం తెలిపింది. చంద్రబాబు పర్యటన ముగిసాక వాటిని తొలగిస్తామని చెప్పినా వినలేదు. దీంతో.. మాటామాటా పెరిగి గొడవ మొదలైంది. సుమారు మూడు గంటల పాటు జాతీయ రహదారిపై ఇరువర్గాల పోటాపోటీ బలప్రదర్శనతో ఉద్రిక్త పరిస్థితి కనిపించింది. రాళ్లబూదుగూరు, రామకుప్పం, గుడుపల్లె ఎస్సైలతోపాటు భారీగా పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకుని పరిస్థితి అదుపు తప్పకుండా చూసేందుకు ప్రయత్నించారు.

శాంతిపురంలో ఉద్రిక్తత విషయం తెలిసి టీడీపీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు అక్కడికి చేరుకున్నారు. పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. చివరికి పోలీసుల జోక్యంతో ఇరువర్గాల మధ్య వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. ఇవాళ చంద్రబాబు పర్యటన సందర్భంగా ఎక్కడా ఉద్రిక్తతలకు తావు లేకుండా చూసేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తారు.

ఇవాళ, రేపు రెండు రోజులపాటు చంద్రబాబు కుప్ప నియోజకవర్గంలో పర్యటిస్తారు. రామకుప్పం మండలం రాజుపేట నుంచి ర్యాలీ మొదలవుతుంది. నియోజకవర్గ కార్యకర్తలతోనూ చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం అవుతారు. మధ్యాహ్నం శాంతిపురంలో బహిరంగసభ ఉంటుంది. రేపు కుప్పం, గుడుపల్లె మండలాల్లో ఆయన పర్యటిస్తారు.

Tags

Read MoreRead Less
Next Story