బంగాళాఖాతంలో అల్పపీడనం..ఇవాళ, రేపు భారీ వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం..ఇవాళ, రేపు భారీ వర్షాలు

ఉత్తర బంగాళాఖాతంలో ఆవర్తనం ప్రభావంతో ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం ప్రకటించింది. రానున్న రెండు రోజుల్లో ఈ అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా, వాయుగుండంగా మారొచ్చని వెల్లడించింది. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం కూడా ఉంది. వీటి ప్రభావంతో ఇవాళ, రేపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లోభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

నిన్న హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసాయి. నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాలు తడిసిముద్దయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా గన్నవరంలో 41 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.

అల్పపీడన ప్రభావంతో కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మత్య్సకారులు వేటకు వెళ్లరాదని, వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి రావాలని విపత్తుల శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తీర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది. మరోవైపు దక్షిణ ఛత్తీస్ గఢ్, దాని చుట్టూ పక్కల ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం కూడా అల్పపీడనంతో కలిసి ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. వీటి ప్రభావంతో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోనూ వచ్చే 24 గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story