ముంబై మళ్లీ మునిగింది.. 24 గంటల్లో 23 సెంటీమీటర్ల వర్షపాతం

ముంబై మళ్లీ మునిగింది.. 24 గంటల్లో 23 సెంటీమీటర్ల వర్షపాతం

ముంబై మళ్లీ మునిగింది.వరణుడి దెబ్బకు ఆర్థిక రాజధాని చిన్నాభిన్నమైంది. వర్షాలు, వరదలు ముంబై పూణే నగరాల్లో బీభత్సం సృష్టించాయి. రవాణా వ్యవస్థ స్తంభించడంతో జనజీవనం అతలాకుతలమైంది.అటు కుండపోత వానతో ముంబైలో ఘోర ప్రమాదం జరిగింది. మలాడ్ ఈస్ట్‌లో గోడ కూలి 12 మంది మృతి చెందారు.మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. అధిక వర్షం వల్ల గోడ కూలడంతో ఈ ఘటన జరిగింది. అటు పుణెలోని అంబెగాన్‌లో కళాశాల గోడ కూలి ఆరుగురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ రెండు ఘటనల్లోనూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

రుతుపవనాల ప్రభావంతో ముంబైలో నాలుగు రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలు, వర దలు, ఉరుములు-మెరుపులు-పిడుగులతో ఆర్థిక రాజధాని అస్తవ్యస్తమైంది. ఇళ్లు, వీధులు, రోడ్లు నీటితో నిండిపోయాయి. రహదారులు చెరువులను తలపిస్తుండగా, అపార్ట్ మెంట్లు నీటిలో చిక్కుకుపోయాయి. మొత్తంగా ముంబై జలసంద్రమైపోయింది.

బాంబేలో 24 గంటల్లో 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాదాపు గంటపాటు రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. బాంద్రాలో 53 మిల్లీమీటర్లు, పరేల్-43, చెంబూర్-37, వర్లి-35, వడాల-32, హాజి అలీలో 26 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు వీచాయి. దాంతో పెద్ద సంఖ్యలో చెట్లు కూలిపోయాయి. కరెంట్ స్తంభాలు విరిగిపడ్డాయి. కొన్ని చోట్ల ఇళ్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. వర్షం, వరద నీటితో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నివాసాల్లోకి వర్షపు నీరు చేరడంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు.

కుండపోత వర్షం, భారీ ఈదురుగాలులతో ముంబైలో రవాణ వ్యవస్థ స్తంభించిపోయింది. జోగేశ్వరి-విఖ్రోలి లింక్ రోడ్, SVరోడ్, LBS మార్గ్‌తో పాటు ప్రధాన రహదారులు జలసంద్రమయ్యాయి. చర్చ్ గేటు, మెరైన్ లైన్ మధ్య ట్రాఫిక్ స్తంభించింది. వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేపై ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. భక్తిపార్క్ ఏరియాలో భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. హింద్‌మాతా జంక్షన్ నుంచి ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. రోడ్లపై మోకాలిలోతున నీళ్లు నిలచి పోవడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.

రైలు, విమాన సర్వీసులకు కూడా అంతరాయం కలిగింది. ముంబై నుంచి బయల్దేరాల్సిన అనేక రైళ్లను రద్దు చేయగా, పుణెలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లోనావాలాలో ఓ గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. ముంబై- పుణె మార్గంలో ఇంటర్‌సిటీ రైళ్లను రద్దు చేశారు. పాల్ఘార్‌లో పట్టాలపైకి వరదనీరు చేర డంతో ముంబై -వల్సాద్ మార్గంలో రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. దాదర్ ఈస్ట్ వద్ద వరదనీరు మోకాలి లోతు చేరింది. సియాన్ -మాటుంగా రైల్వే స్టేషన్ల మధ్య వరదనీరు పట్టాలను ముంచెత్తడంతో ఆ మార్గంలో రైళ్లను నిలిపివేశారు.

Tags

Read MoreRead Less
Next Story