'కీరవాణి' రాగంలో.. టాలీవుడ్ తడిచి ముద్దైంది

కీరవాణి రాగంలో.. టాలీవుడ్ తడిచి ముద్దైంది
X

కీరవాణి .. పేరులోనే రాగాన్ని ఇముడ్చుకున్న స్వరఝరీ. భద్రగిరి రామయ్య పాదాలు కడిగి.. ప్రతి శ్రోత మదినీ తడిమి.. తనదైన మధుర బాణీల్లో ఓలలాడిస్తోన్న సుమధుర వాణి కీరవాణి.

రాగాలతో సరాగాలాడుతూ శ్రోతలను మంత్రముగ్ధులను చేయడం కీరవాణికి కీ బోర్డ్ తో పెట్టిన విద్య. అన్నమయ్యను మరిపించి.. రామదాసులా రాముణ్నే రంజింపజేసి.. రాఘవేంద్రుని రసభరిత సినిమాలకు సప్తస్వరాలను అద్ది.. ప్రస్తుతం రాజమౌళితో సురాగయానం సాగిస్తోన్న కీరవాణి పుట్టిన రోజు ఇవాళ.

కీరవాణి సంగీత దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టేనాటికి అప్పటి వరకూ చిత్రపరిశ్రమను ఏలిన కెవి మహదేవన్ లాంటి వారు నిష్ర్కమణ దశలో ఉన్నారు. ఇళయరాజా పీక్స్ లో ఉన్నాడు.. దీంతో ఒక సాలూరిలా, ఒక చక్రవర్తిలా మనదైన సంగీతం అందించేందుకు మనవాళ్లెవరూ లేరే అన్న ఫీలింగ్ చాలామందిలో ఉన్న టైమ్ అది. అఫ్ కోర్స్ అప్పటికి రాజ్ కోటి ఉన్నారు. అయినా ఏదో లోటు. ఆ సమయంలోనే నేనున్నానంటూ వచ్చాడు కీరవాణి. చాలా తక్కువ టైమ్ లోనే తన ముద్రను చూపిస్తూ.. తెలుగు సినిమా పాటకు దిక్సూచిగా మారాడు కీరవాణి..

1987లో అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్ గా అప్పటి మాస్ సినిమాల సంగీత సంచలనం చక్రవర్తి వద్ద శిష్యరికం మొదలు పెట్టాడు కీరవాణి. మూడేళ్ల తర్వాత 1990లో కల్కి అనే సినిమాకు అవకాశం వచ్చింది. కానీ ఆ సినిమా ఇప్పటి వరకూ రిలీజ్ కాలేదు.. ఆ తర్వాత దర్శకుడు మౌళి ఆఫర్ ఇచ్చాడు. ఉషాకిరణ్ బ్యానర్ లో రూపొందిన మనసు మమతతో కీరవాణి స్వర ప్రయాణం ప్రారంభమైంది.. ఆ ప్రయాణం ఎన్నో బ్లాక్ బస్టర్ మజిలీలతో నేటికీ కొనసాగుతూనే ఉంది.

ఏ ప్రతిభావంతుడికైనా అవకాశం రావడం ప్రధానం. దాన్ని అందరూ అదృష్టం అంటారు. ఆ అదృష్టం రాగానే తన ప్రతిభతో ప్రేక్షకులను పాటల తోటలో విహరింప చేశాడు. అందుకే మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ మొదలుపెట్టిన ఏడాదే ఐదు సినిమాలు చేశాడు. వీటిలో అతని కెరీర్ లో ఆల్ టైమ్ బెస్ట్ మ్యూజికల్ హిట్ గా చెప్పుకునే సీతారామయ్యగారి మనవరాలూ ఉంది.. సీతారామయ్యగారి మనవరాలు కీరవాణికి పెద్ద బ్రేక్ ఇచ్చింది.. ఈ సినిమాతో అతను తెలుగు సినిమా సంగీతంపై తనదైన ముద్రను బలంగా వేశాడనే చెప్పాలి.

రెండేళ్లలోనే అచ్చ తెలుగు సంగీత దర్శకుడిగా కీరవాణి తనకంటూఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.. కానీ బంపర్ హిట్స్ అంటూ పెద్దగా లేవనే చెప్పాలి. పైగా అటువైపు ఇళయరాజా దూకుడుమీదున్నాడు.. మరోవైపు రాజ్ కోటి ఆకట్టుకుంటూనే ఉన్నారు. మొత్తంగా అప్పటికి మంచి పేరు వచ్చింది కానీ, అనుకున్నంత కాదు. ఆ టైమ్ లో రాఘవేంద్రరావు పరిచయం కీరవాణి స్వరఝరీని మార్చివేసింది. రాఘవేంద్రరావు దర్శకత్వలో చేసిన ఘరానామొగుడు కీరవాణికి తిరుగులేని ఇమేజ్ నిచ్చింది. ఈ సినిమా తర్వాత వరుసగా ఆయన సంగీతాన్నందించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి.

1992లో మొత్తంగా 14 సినిమాలకు సంగీతం అందించాడు కీరవాణి.. వీటిలో మూడోది ఘరానామొగుడు.. ఘరానా మొగుడు తర్వాత వచ్చిన సినిమాలు.. సుందరకాండ, అల్లరి మొగుడు, ప్రెసిడెంట్ గారి పెళ్లాం... చిన్నఅల్లుడు, రౌడీ మొగుడు.. ఇలా చేసిన సినిమాలన్నీ ఇటు మ్యూజికల్ గానూ అటు కమర్షియల్ గానూ సూపర్ హిట్స్ గా నిలిచాయి.. ముఖ్యంగా రాఘవేంద్రరావు, కీరవాణి కాంబినేషన్ బంపర్ హిట్ అయింది..

అయితే ఇదే యేడాది చేసిన మరో ఆల్ టైమ్ మ్యూజికల్ హిట్ మూవీ ఆపద్బాంధవుడు.. అప్పటి వరకూ తన సినిమాలకు కెవి మహదేవన్ తో మాత్రమే సంగీతం చేయించుకున్న విశ్వనాథ్ తొలిసారిగా కీరవాణిని తీసుకున్నాడు.. ఆ సెలక్షన్ ఏ మాత్రం తప్పు కాదని.. మనం ఇప్పుడు వింటున్నా మైమరచిపోయేలా కంపోజ్ చేసిన ఆ పాటలే నిదర్శనం..

ఇక అప్పటి నుంచి కీరవాణి కొట్టిందల్లా హిట్ అయింది. ఇళయరాజా తర్వాత మెలోడీకి కొత్తబాణీలేస్తూ పోయాడు.. కీరవాణి వేగానికి అప్పటి వరకూ మాస్ సాంగ్స్ తో టాలీవుడ్ ను ఊపేస్తోన్న రాజ్ కోటిల ద్వయం కూడా వెనకబడక తప్పలేదు.. అదే ఊపులో మాతృదేవోభవ సినిమాకు ఆయనే పాడిన పాటకు ఉత్తమ గేయరచయితగా వేటూరి నేషనల్ అవార్డ్ అందుకున్నాడు..

ఘరానామొగుడు తర్వాత దాదాపు దశాబ్ధం పాటు కీరవాణి తెలుగు సినిమా సంగీతాన్ని శాసించాడు.. రాఘవేంద్రరావు కాంబినేషన్ లో చేసిన సినిమాలన్నీ ఇప్పటికీ మ్యూజికల్ హిట్స్ గానే నిలిచాయి.. ఇదే టైమ్ లో మరోసారి విశ్వనాథ్ డైరెక్షన్ లో శుభసంకల్పం సినిమాతో రెచ్చిపోయాడు.. ఇందులోని అన్ని పాటలూ సూపర్ హిట్టే..

కీరవాణి కెరీర్ లో ఎవర్ గ్రీన్ సాంగ్స్ కు లెక్కేలేదు.. అయినా రాఘవేంద్రరావుతో చేసిన సినిమాలన్నీ ఒకెత్తు అనేలా 1997లో వచ్చిన అన్నమయ్య నిరూపించింది. అప్పటి వరకూ అన్ని రకాల సినిమాలు చేసినా డివోషనల్ విషయంలో కీరవాణి ప్రతిభేంటో పెద్దగా తెలియదు.. అన్నమయ్య తర్వాత కీరవాణి సంగీతంపై ఎంతో మందికి గౌరవంపెరిగిందంటే అతిశయోక్తి కాదు.. ఇందులో కొన్ని అన్నమయ్య కీర్తనలున్నా.. వాటికీ తనశైలిలో అద్భుతమైన రాగాలు కూర్చాడు. వాటిని కన్నుల విందుగా తెరకెక్కించాడు రాఘవేంద్రుడు.. అన్నమయ్యకు కీరవాణి ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డూ అందుకున్నాడు..

అన్నమయ్య కంటే ముందు వీరి కాంబినేషన్ లో పెళ్లిసందడి, సాహసవీరుడు సాగరకన్య, బొంబాయి ప్రియుడు లాంటి మ్యూజికల్ హిట్స్ చాలానే ఉన్నాయి.. కీరవాణి మధురబాణీలకు అటు రాఘవేంద్రరావు తనశైలిలో రసకందాయంగా చిత్రీకరించాడు.. కానీ అన్నమయ్య లో అలా కాదు.. కాస్త శృంగార రసం ఉన్నా రాఘవేంద్రరావుకూ అందకుండా తన సంగీతంతో భక్తిభావాన్ని తెరంతా నింపేశాడు కీరవాణి..

2000ల తర్వాత తెలుగు తెరపై కొత్త సంగీత కెరటాలు చాలానే లేచాయి.. అయినా వారిలో ఎవ్వరూ కీరవాణిని అందుకోలేకపోయారనేది సత్యం.. ఇటు కీరవాణి కూడా కాస్త స్పీడ్ తగ్గించాడు.. అయినా అతనికి రాఘవేంద్రరావు ఫ్యాక్టరీ నుంచి వచ్చిన రాజమౌళి రూపంలో మరో అస్త్రం తోడైంది.. ఇద్దరూ బంధువులు కూడా కావడంతో వీరికి బాగా సింక్ అయింది. ముఖ్యంగా రాజమౌళి తరహా భావోద్వేగాలకు కీరవాణి అందించే ఆర్ ఆర్ సన్నివేశాన్ని శిఖర స్థాయిలో ఎలివేట్ చేస్తూ వస్తోంది..

ఇక అటు రాఘవేంద్రరావు వందో సినిమా అల్లు అర్జున్ తొలి సినిమాగా వచ్చిన గంగోత్రితో మరోసారి వీరి జంట ప్రేక్షకులకు శ్రవణానందం కలిగించింది. గంగోత్రిలోని పాటలన్నీ సూపర్ హిట్సే కదా.. అలాగే మళ్లీ ఈ రసరాఘవేంద్రుడు చేసిన భక్తి చిత్రం రామదాసుతో మళ్లీ ఓ అద్భుత సంగీతం ఆవిర్భవించింది.. తర్వాత పాండురంగడులోని పాటలతో అదరగొట్టాడు కీరవాణి..

కొన్నేళ్లుగా సెలెక్టెడ్ సినిమాలే చేస్తోన్న కీరవాణి.. రాజమౌళితో బంధాన్ని వదల్లేదు.. మగధీర తర్వాత ఆడియో పరంగా చాలా సినిమాలు హిట్ అయినా.. కమర్షియల్ గా చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో కీరవాణి సంగీతం కూడా కాస్త వెనకబడింది.. మరోవైపు రాజమౌళికి మాత్రమే మంచి సంగీతం ఇస్తాడు అనే విమర్శలూ రాకపోలేదు.. దీనికి ఆయన సమాధానం తెలిసిన వారికి సంగీతం ఇవ్వడం సులువు కదా.. సంగీతం గురించి ఏమీ తెలియని వారికి ఏ సంగీతం ఇవ్వాలో మనకెలా అర్థమౌతుంది అని..

ఇక తన నుంచి ఏం ఆశిస్తున్నారో తెలిసిన వారికి కీరవాణి ఎలాంటి సంగీతం ఇస్తాడో అందరికీ తెలుసు.. అందుకు రాజన్న సినిమాయే ఉదాహరణ.. పెద్దవారి నుంచి చిన్న పిల్లల వరకూ ఇందులోని పాటలను ఎంత ఇష్టపడ్డారో అందరికీ తెలిసిందే.. అంటే సంగీతం పై అవగాహన ఉన్న వారికి కీరవాణి నుంచి సంగీతం పూర్తి స్థాయిలో వస్తుందన్నమాట..

బాహుబలి సంగీతంతో కీరవాణి ప్రతిభ ఎల్లలు దాటింది. సినిమాకెంత పేరు వచ్చిందో ఆయన సంగీతానికీ అంతే పేరొచ్చింది. నిజానికి కీరవాణి సంగీతం లేని బాహుబలిని ఊహించలేం అన్నంతగా ఓ అద్భుతాన్నే ఆవిష్కరించాడు. రాజమౌళికి ఏం కావాలో.. ఆయనకంటే బాగా తెలిసినవాడిలా కీరవాణి బాహుబలి సంగీతంతో ఒక్కసారిగా ఎన్నో శిఖరాలకు చేరాడు.

బాహుబలి తర్వాత సినిమా సంగీతం నుంచి తప్పుకుంటానని సంచలన ప్రకటన చేశాడు. కానీ అభిమానుల నుంచి వ్యతిరేకత రావడంతో ఆ నిర్ణయాన్ని విరమించుకున్నాడు. కొన్ని చిన్న సినిమాలూ చేశాడు. అలాగే బాహుబలి ద కంక్లూషన్ తో మరోసారి ఆకాశమంత ఎదిగాడు. ఈ సినిమాలో ప్రతి బీట్, ప్రతి సాంగ్ ఓ అద్భుతం. ఫస్ట్ పార్ట్ ను మించిన మ్యాజిక్ ఏదో ఈ భాగంలో చేశాడు. అందుకే ఈ కంక్లూషన్ పార్ట్ బిగినెంట్ పార్ట్ కంటే బిగ్గెస్ట్ హిట్ అయింది. మొత్తంగా కీరవాణి అంటే తెలుగు సినిమా సంగీతానికి దొరికిన ఓ మరకతమణి. ఆ మణి పూసలు మరిన్ని మన సినిమాకు అందించాలని కోరుకుంటూ కీరవాణికి బర్త్ డే విషెస్.

Next Story

RELATED STORIES