తాజా వార్తలు

నిధులు దోచుకోవడంలో పోటీపడుతున్న మున్సిపాలిటీ సిబ్బంది, పాలకవర్గం

నిధులు దోచుకోవడంలో పోటీపడుతున్న మున్సిపాలిటీ సిబ్బంది, పాలకవర్గం
X

ఒకప్పుడు నల్గొండ మున్సిపాలిటీలో పురపాలన రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచింది. ఆ పట్టణవాసుల మెప్పునుసైతం పొందింది. అయితే.. గతకొన్నేళ్లుగా తిరోగమనం వైపు పయనిస్తోంది. అభివృద్ది అజెండాని పక్కనపెట్టిన పాలకమండలి.. కాసులు కురిసే పనులకే మొగ్గుచూపడంతో పాలన అస్తవ్యస్తంగా మారింది. ఆయా పార్టీలకు చెందిన రాజకీయ నాయకుల అండతో.. దళారులకు అడ్డాగా మారింది. కమీషనర్లుగా వస్తోన్న వారికి మున్సిపాలిటీపై పట్టులేకపోవడం.. చాలాకాలంగా ఉద్యోగులు ఆయా పోస్టుల్లో తిష్టేయడంతో పాలన గాడి తప్పింది. ఆరేళ్లకాలంలోనే దాదాపు ఏడుగురు మున్సిపల్ కమిషనర్లు మారారంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

నల్గొండ మున్సిపాలిటీ జనాభా 1 లక్షా 20వేల దాటింది. పెద్దఎత్తున వ్యాపార సముదాయాలున్నాయి. దీంతో.. ఆస్తి పన్ను, అనుమతులు, అద్దెల రూపంలో కోట్లాది రూపాయలు ఆదాయం రావాల్సి ఉంది. కానీ అవినీతి అధికారులు, సిబ్బంధి, పాలకమండలి, దళారులు, రాజకీయ నాయకుల పుణ్యమాని ఇది 40 నుంచి 50శాతానికి మించి ఆదాయం రావడం లేదు. దాదాపు వందకుపైగా పురపాలన స్థలాల్లో వ్యాపారసంస్థలున్నాయి. వీటినుంచి కోట్లాది రూపాయలు అద్దెల రూపంలో వసూలు కావల్సి ఉంది. కానీ వచ్చేది మాత్రం లక్షల్లోనే ఉంది. వీటి ఆదాయం పెంచడానికి ప్రయత్నాలు జరిగినా కొందరు పెద్దలు అడ్డుకుంటున్నారు. కోర్టులో స్టే తెచ్చుకుని ఆదాయానికి గండికొడుతున్నారు. కొంతమంది రాజకీయ పార్టీల నేతలు వెనకుండి నడపిస్తున్నారనే ఆరోపణలుసైతం వినిపిస్తున్నాయి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏటా కోట్లాది రూపాయల అభివృద్దిపనులు జరగాల్సి ఉన్నప్పటికీ.. అవినీతి, నిర్లక్ష్యం కారణంగా ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారింది. రహదారులన్నీ గుంతలమయంగా మారాయి. శివారు ప్రాంతాలకు రహదారి సదుపాయాలు కల్పించలేదు. వారానికోసారి తాగునీటి సరఫరాతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. వ్యాపార, గృహ సముదాయాలు, మార్కెట్లు, పబ్లిక్ స్తలాల్లో చెత్తా-చెదారంతో కంపు కొడ్తోన్నా.. పట్టించుకునే నాథుడే కరువయ్యారు. చెత్త సేకరణ, రవాణా పేరిట కాగితాల్లో నెలకు లక్షలాది రూపాయలు ఖర్చుచేస్తున్నా.. క్షేత్రస్థాయలో మాత్రం క్లీన్ వాతావణం మాత్రం కనిపించదు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్చ భారత్ కార్యక్రమంలో భాగంగా.. ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మాణానికి కోట్లాది రూపాయల వచ్చినా.. వాటిలో నకిలీ లబ్దిదారులతో నిధులు పక్కదారి పట్టించినట్టు ఆరోపణలున్నాయి.

నల్గొండ పురపాలక సంఘంలో పనులు కావు కానీ.. అవినీతి మాత్రం ధారాళంగా వ్యాపించింది. నిధులు పెద్ద ఎత్తున పక్కదారి పట్టించినట్టు ఆడిట్ లో తేలింది. ఐదేళ్లకాలంలో.. దాదాపు మూడున్నర కోట్ల అవినీతి బైటపడింది. 30 మందికి పైగా సిబ్బంది అక్రమాలకు పాల్పడినట్టు ప్రభుత్వం గుర్తించింది. ఇందులో పెద్దలు, ప్రముఖులు ఉన్నా.. రాజకీయ నాయకుల అండదండలతో తప్పించుకున్నారు. నామమాత్రంగా కొందరిపై చర్యలు తీసుకుని కేసును పక్కదారి పట్టించారు. పూర్తిస్థాయి దర్యాప్తు కూడా జరపకుండానే కేసుకు ముగింపు పలికారు.

అటు మున్సిపాలిటీ పాలకవర్గం పదవీకాలం ముగుస్తుండటంతో.. సొంత ఆదాయంపై చైర్మన్, కౌన్సలర్లంతా ఫోకస్ పెట్టారు. ప్రతి పనికీ రేట్ కార్డ్ పెట్టీ మరీ వసూల్ చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. లే అవుట్ల అనుమతులు, అభివృద్దిపనుల బిల్లుల శాంక్షన్ సహా ఇతర అనుమతులకు పర్సెంటేజీల రూపంలో వసూల్ చేస్తున్నారనే విమర్శలున్నాయి. లంచాలు రూపంలో వసూలైన సొమ్మును అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్లు అనే తేడాలేకుండా.. వాటాలు వేసుకొన మరీ పంచుకుంటున్నారు. కొన్నిరోజుల కిందట.. నల్లగొండ మున్సిఫల్ చైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మీ మీద అవిశ్వాసం పెట్టాలంటూ.. కొంతమంది కౌన్సిలర్లు పట్టుపట్టడం చర్చనీయాంశంగా మారింది. అడ్డదారుల్లో వస్తోన్న డబ్బులో తమకు వాటా దక్కకపోవడంవల్లే వారు ఆ రకంగా ప్రయత్నించడం.. వారిని కొందరు బుజ్జగించడం.. ఆ తర్వాత వాటాలు ప్రకారంగా.. పార్టీలకతీతంగా జెబుల్లోకి డబ్బులు వస్తుండటంతో.. అంతా గప్-చిప్ అయ్యారట. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా భారీగా నగదు ముట్టినట్టు ఆరోపణలున్నాయి. ఒకప్పుడు ఆదర్శంగా ఉన్న నల్లగొండ మున్సిపాలటీ.. ప్రస్తుతం అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారింది. దీనిపై పట్టణవాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా.. రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లోంచి మున్సిపాలిటీని బైటపడేసి.. అవినీతి-అక్రమార్కులపైన కఠినచర్యలు తీసుకోవాలనే డిమాండ్ చేస్తున్నారు.

Next Story

RELATED STORIES