మొన్న ఫ్లెక్సీ.. నిన్న వాటర్ ఫ్లాంట్ వివాదం.. టీడీపీ, వైసీపీ మధ్య ఆగని ఘర్షణలు

మొన్న ఫ్లెక్సీ.. నిన్న వాటర్ ఫ్లాంట్ వివాదం.. టీడీపీ, వైసీపీ మధ్య ఆగని ఘర్షణలు

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న గొడవలు సైతం... పెద్దవవుతున్నాయి. పోలీసులు సర్ధి చెప్పినా.. ఇరువర్గాలు వినే పరిస్థితి లేదు. కుప్పంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా శాంతిపురంలో టీడీపీ ఫ్లెక్సీల వివాదం చల్లారక ముందే.. గుంటూరులోనూ ఇలాంటి ఘటనే జరిగింది. రేపల్లెలో తమ ఫ్లెక్సీ పక్కనే టీడీపీ నేతలు ఫ్లెక్సీలు కట్టడంతో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. టీడీపీ ఫ్లెక్సీలను చించిపారేశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది.

వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్డుమీద బైఠాయించారు. టిడిపి కార్యకర్తలు కూడా ఫ్లెక్సీ ఇక్కడే ఏర్పాటు చేయాలని 500 మందికి పైగా కార్యకర్తలు రోడ్డు పై బైఠాయించారు. జై జగన్‌, జై చంద్రబాబు నినాదాలతో సాయంత్రం వరకు హైడ్రామా నడిచింది. చివరికి వైసిపీ టీడీపీ కార్యకర్తలకు పోలీసులు నచ్చచెప్పి పంపించడంతో గొడవ సద్దుమణిగింది. ఆ తర్వాత పట్టణంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అటు... కర్నూలు జిల్లాలోనూ టీడీపీ, వైసీపీ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. బనగానపల్లిలో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్‌లపై రాజకీయ వేడి రాజుకుంది. యాగంటిలో మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌ రెడ్డి ఏర్పాటు చేసిన ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్‌కు వైసీపీ కార్యకర్తలు తాళాలు వేశారు. దీంతో ఆగ్రహించిన జనార్ధన్‌రెడ్డి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ, ఇటు టీడీపీ శ్రేణులు తరుచూ బాహాబాహీకి దిగుతుండటంతో.. రాష్ట్రంలో శాంతిభద్రత రక్షణ పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉందంటున్నారు ప్రజలు. రెండు పార్టీల నేతలు సంయమనం పాటించాలని కోరుతున్నారు. ఈ ఘర్షణ తీవ్రస్థాయికి చేరితే.. ఇరు పార్టీలకు తీవ్ర నష్టం చేకూర్చే ప్రమాదం ఉందంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story