ఆర్నెల్లుగా చికెన్‌ లేక తీవ్ర ఇబ్బంది పడుతున్న ఊరి ప్రజలు..!

ఆర్నెల్లుగా చికెన్‌ లేక తీవ్ర ఇబ్బంది పడుతున్న ఊరి ప్రజలు..!

ఆదివారం వచ్చిందంటే చాలు ప్రతి ఇంట చికెన్‌ ఉండాల్సిందే. ముక్క లేనిదే కొందరికి ముద్ద దిగదు. ఇంట్లో కోడి కూర వండుకుని తినాలనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఆ ఊరిలో మాత్రం కోడి కూర బంద్‌. అవును. ఊళ్లో కోడి కొయ్యకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు ఆ గ్రామ పెద్దలు. దీంతో గత ఆరు నెలలుగా చికెన్‌లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ఈ ఊరి ప్రజలు.

కర్నూలు జిల్లా మహానంది మండలం గోపవరం గ్రామంలో ఆరు నెలల క్రితం పీర్ల పండగ జరిగింది. పండుగ సందర్భంగా ఓ వర్గానికి చెందిన కాశన్న, అతని కుటుంబ సభ్యులతో కలిసి పీర్లను దర్శించుకోవడానికి వెళ్లాడు. అక్కడ ఉన్న ఓ వర్గానికి చెందిన పెద్దలు.. దర్శనానికి అనుమతివ్వలేదు. అంతే కాకుండా కులం పేరుతో దూషించారు. చదువుకున్న వ్యక్తి అయిన కాశన్న.. తనకు జరిగిన అవమానంపై మహానంది పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇద్దరిపై కేసు నమోదు చేశారు. దీంతో ఆగ్రహించిన ఆ వర్గానికి చెందిన పెద్దలు..ఇవాళ్టీ నుంచి ఎవరూ ఊళ్లో కోళ్లు కోయకూడదంటూ తీర్మానం చేశారు. దీంతో ఆ గ్రామంలో ఉన్న మూడు చికెన్‌ సెంటర్లు గత ఆరు నెలలుగా మాతపడి ఉన్నాయి.

తమ జీవనాధరంగా ఉన్న చికెన్‌ సెంటర్లు మూతపడడంతో వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. తినేందుకు చికెన్‌ లేక అటు గ్రామస్తులు అసంతృప్తికి గురవుతున్నారు. షాపులు తెరిస్తే చాలు అంతా ఏకమై బలవంతంగా మూసివేయిస్తున్నారు. తమపై పెట్టిన కేసును ఉపసంహరించుకుని.. ఊరి మధ్యలో తమ కాళ్లు పట్టుకుంటేనే తీర్మానం ఉపసంహరించుకుంటామని అహంకారం ప్రదర్శిస్తున్నారు ఆ వర్గానికి చెందిన పెద్దలు.

Tags

Read MoreRead Less
Next Story