తాజా వార్తలు

ఇక్కడ మీ అటెన్షన్‌ డైవర్ట్ అయిందో ప్రాణం పోవడం ఖాయం

ఇక్కడ మీ అటెన్షన్‌ డైవర్ట్ అయిందో ప్రాణం పోవడం ఖాయం
X

అవి కిల్లర్‌ రోడ్స్. వాటిపై ప్రయాణమంటే రోడ్ల రక్తదాహార్తి తీర్చడమే. అక్కడ ఏటా వందల్లో ప్రాణాలు గాల్లో కలుస్తుంటాయి. ఇంజినీరింగ్‌ లోపాలు, కాంట్రాక్టర్ల కక్కుర్తి, సర్వీస్ రోడ్లు లేక ప్రయాణీకుల్ని మృత్యు ఒడిలోకి చేర్చుతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో హైవేలు కిల్లర్‌ రోడ్స్‌ ఎందుకు మారుతున్నాయి. టీవీ5 గ్రౌండ్‌ రిపోర్ట్‌.

తెలంగాణ-ఏపీ రాష్ట్రాలను కలిపే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రధాన రహదారి ఇది. నిత్యం వేల వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ఇక్కడ డ్రైవింగ్‌ చేసేపుడు అటెన్షన్‌గా ఉండాల్సిందే. ఏ మాత్రం కేర్‌లెస్‌గా ఉన్నా ప్రాణాలు గోవిందా. ఈ రోడ్లపై గత మూడేళ్లలో సుమారు 18 వందల మంది మత్యువాత పడ్డారు. Yes మీరు వింటున్నది నిజమే. తీవ్రగాయాలతో ప్రాణాలు దక్కించుకున్నవారు వేలల్లోనే ఉంటారు. తోబుట్టువులు, బంధువులు, మిత్రుల జీవితాల్లో హైవేలు అంతులేని విషాదాన్ని నింపుతున్నాయి.

హైదరాబాద్‌- విజయవాడ దారిలో చౌటుప్పల్‌, చిట్యాల, నార్కెట్‌పల్లి, నకిరేకల్‌, సూర్యాపేట్‌, కోదాడ, మునగాల సహా పదుల సంఖ్యలో గ్రామాలున్నాయి. మొత్తం 64 అండర్‌ పాస్‌ వంతెనల అవసరం ఉండగా, వాటిలో సగమే పూర్తయ్యాయి.జిల్లాలోని అనేక ప్రధాన జంక్షన్ల వద్ద అవసరమైన చోట్ల రోడ్‌ అండర్‌పాస్‌లు, ఫ్లై ఓవర్లు, సర్వీస్‌ రోడ్లు లేవు. చుట్టుపక్కల ప్రజలు ఒక్కసారిగా హైవేపైకి వచ్చి మృత్యు ఒడిలోకి చేరుతున్నారు. నార్కెట్‌పల్లి కామినేని వై జంక్షన్‌ అత్యంత ప్రమాదకర జంక్షన్‌. బ్లాక్‌ స్పాట్‌లుగా గుర్తించి చర్యలు తీసుకున్నా... ప్రమాదాలు నిత్యకృతం.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో హైవేలన్నీ డేంజర్‌ జోన్లే. రిపేర్లు అసవరం ఉన్న చోట్ల పనులు నత్తనడకన సాగుతున్నాయి. నిర్మాణాలు పూర్తికాకపోయినా టోల్‌ ప్లాజాల్లో దోపిడీ మాత్రం యధేచ్ఛగా కొనసాగుతోంది. ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయ లోపానికి జనం మూల్యం చెల్లించుకుంటున్నారు.నకిరేకల్‌- సూర్యాపేట మధ్యలో మూసీ నది ప్రవహించే ప్రాంతం టేకుమట్ల టర్నింగ్‌ యమడేంజర్‌. ఇక్కడి 10 గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. అండర్‌పాస్‌ లేక జనాల ప్రాణాలు హారీమంటున్నాయి. వాయు వేగంతో వచ్చే వాహనాలకు స్థానికులు బలవుతున్నారు. రోడ్లు వేసి వాటి నిర్వహణ గాలికి వదిలేస్తున్నారు. నల్గొండ జిల్లా ప్రధాన రహదారుల్లో ఈ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. రోడ్లు బాగాలేకపోయినా టోల్‌ ప్లాజాలో ఫీజులు మాత్రం వసూలు చేస్తున్నారని ఫైరవుతున్నారు స్థానికులు.

హైదరాబాద్‌- వరంగల్‌ హైవేమీద బీబీనగర్‌, భువనగిరి బైపాస్, రాయగిరి వరకు బాగానే ఉన్నా... ఆ తర్వాత రోడ్ పనులు ముక్కుతూ మూలుగుతూ సాగుతున్నాయి. మర్రిగూడ బైపాస్‌ జంక్షన్‌ నుంచి నల్గొండ టౌన్‌లో వచ్చే సర్కిల్‌ కూడా ప్రమాదాలకు నిలయం. దుప్పలపల్లి, తిప్పర్తి, మాడ్గులపల్లి, వేములపల్లి, దామరచర్ల ప్రాంతాల్లో రోడ్‌ అండర్‌ పాస్‌లు, సర్వీస్‌ రోడ్లు లేక నెలలో కనీసం ఐదారుగురు మృత్యువాత పడుతున్నారు.

హైదరాబాద్- నాగార్జున సాగర్ హైవే నిర్మాణ పనులు పూర్తయినా... ఇక్కడ కూడా అవే సమస్యలు. నిత్యం జనం, ట్రాక్టర్లు, పశువులు దురదృష్టాన్ని వెతుక్కుంటూ హైవేపైకి వస్తున్నాయి. హైవే పై బ్లాక్‌ స్పాట్లు, యాక్సిడెంట్‌ జోన్లపై పోలీసులకు, అధికారులకు, నిర్మాణ సంస్థ ప్రతినిధులకు సమన్వయం లేకనే ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆరోపణలున్నా ఎవరికీ పట్టడంలేదు.

Next Story

RELATED STORIES