కేసీఆర్ ఆశయానికి తూట్లు.. మిషన్‌ భగీరథ పైపుల్ని అమ్ముకుంటున్న అధికారులు

కేసీఆర్ ఆశయానికి తూట్లు.. మిషన్‌ భగీరథ పైపుల్ని అమ్ముకుంటున్న అధికారులు

తెలంగాణంలో ప్రతి ఇంటికి నల్లా ఉండాలన్నది సీఎం కేసీఆర్‌ ఆశయం! అందుకే కోట్ల రూపాయలు ఖర్చైనా సరే... మిషన్‌ భగీరథ చేపట్టారు. కానీ సీఎం ఆశయానికి ఆదిలోనే తూట్లు పొడుస్తున్నారు కొందరు అధికారులు. మిషన్‌ భగీరథ పైపుల్ని అమ్మేసి....తమ జేబు నింపుకుంటున్నారు. టీవీ5 పరిశోధనలో వెలుగు చూసిన ఆ స్కాం.... పుట్టు పూర్వోత్తరాలేంటో మీరే చూడండి..!

ఇంటింటికి మంచినీరు అందించాలనే లక్ష్యంతో....సీఎం కేసీఆర్‌ మిషన్ భగీరథ చేపట్టారు. అయితే.. ఆయన లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కొందరు అధికారులు. కాసులకు కక్కుర్తి పడి.... మిషన్‌ భగీరథ పైపులను మాయం చేస్తున్నారు. రైతులకు తక్కువ ధరకే ఆ పైపుల్ని అమ్మేస్తున్నారు. టీవీ 5 పరిశోధనలో ఈ భారీ స్కాం వెలుగులోకి వచ్చింది.

నాగర్ కర్నూల్ జిల్లాలో మిషన్ భగీరథ పథకం పనులు జోరుగా సాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 1862 కిలో మీటర్ల పైపు లైన్ లు వేస్తున్నారు. ఈ పనుల విలువ 40 కోట్ల రూపాయలు. అయితే... గతంలో ఎన్నికల కోడ్ ఉండటంతో కొన్ని చోట్ల పనులు ఆగిపోయాయి. ఇదే అదునుగా కింది స్ధాయి సిబ్బంది సబ్ కాంట్రాక్టర్లతో కుమ్మక్కై పైపుల్ని రైతులకు అమ్మేస్తున్నారు. తక్కువ ధరకే ఈ పైపులు వస్తుండటంతో వాటిని కొనేస్తున్నారు రైతులు.

ఒక్క బిజినేపల్లి మండలంలోనే దాదాపు 20 లక్షల రూపాయల విలువైన పైపులు అమ్మేసినట్లు తెలుస్తోంది. ఈ మండలంలోని లట్టుపల్లి గ్రామంలో పెద్ద ఎత్తున మిషన్ భగీరథ పైపుల్ని అమ్మేశారు అధికారులు. వీటిని కొన్న రైతులు... కేఎల్ఐ కాలువ నుంచి తమ పొలాల వరకు కిలో మీటర్ నుంచి 3 కిలో మీటర్ల వరకు గుంతల్ని తవ్వి పైపు లైన్ తీసుకువెళ్ళారు.

అటు.. మిషన్ భగీరథ ఈఈ శ్రీధర్ రావు సైతం.....పైపులు మాయమైన విషయం నిజమేనని ఒప్పుకున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామంటున్నారు. మిషన్‌ భగీరథ పైపుల స్కాం బయటపడటంతో ఖంగుతిన్నారు అధికారులు. అటు.. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వ్యాప్తంగా జరుగుతోన్న ఈ స్కాంపై సమగ్ర విచారణ జరపాలంటున్నాయి విపక్షాలు.

Tags

Read MoreRead Less
Next Story