పగలు-రాత్రి అని తేడా లేకుండా..

పగలు-రాత్రి అని తేడా లేకుండా..

అసలే రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం అది. కనీసం అటువైపు చూసే నాథుడు సైతం ఉండరు. ఇదే కొంతమంది దళారులు, అవినీతి అధికారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. విలువైన సున్నపురాయి గనుల్లో అక్రమ తవ్వకాలు, తరలింపు యధేచ్చగా కొనసాగుతుంది. కోట్ల రూపాయలను పోగేసుకుంటున్నారు. పగలు రాత్రి అనే తేడాలేకుండా కొనసాగుతున్న ఈ దందా ఎక్కడనుకుంటున్నారా..?

తెలంగాణ ప్రాంతంలో పాడి-పంటలే కాదు.. ఖనిజ నిక్షేపాలకు కొదవే లేదు. ఉత్తర తెలంగాణలో బొగ్గు నిక్షేపాలు పుష్కలంగా ఉండగా.. దక్షణ తెలంగాణాలోనూ భారీగా కొండలు-గుట్టలు సహా సున్నపురాయి, నాపరాయి గనులు పెద్దఎ్తతునే ఉన్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని సూర్యాపేట, హుజూర్ నగర్ నియోజకవర్గంలో మాత్రం వీటి విస్తీర్ణం కాస్త ఎక్కువేనని చెప్పొచ్చు. ఇక.. నాగార్జునసాగర్, దామరచర్ల, అడవి దేవులపల్లి, మఠంపల్లి ప్రాంతాల్లో భారీగానే కొండలు, గుట్టలు, నల్లరాయి, సున్నపురాయి గనులు విస్తరించి ఉన్నాయి.

హుజూర్ నగర్ నియోజకవర్గం పరిధిలో.. భారీ సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయి. ఈ సిమెంట్ పరిశ్రమలకు దశాబ్దాల కిందటే.. ఆ నాటి ప్రభుత్వాలు 99ఏళ్ల లీజు కాలంతో పెద్దఎత్తున వందలాది ఎకరాల సున్నపురాయి గనులను ఇచ్చేశాయి. అవన్నీ పోగా.. మిగిలిన వందలాది ఎకరాల సున్నపురాయి గనులు మాత్రం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉన్నాయి. కొంతమంది అవినీతి అధికారుల పుణ్యమా అని.. అక్రమంగా, అడ్డదారుల్లో నిత్యం వందలాది టన్నులకొద్దీ సున్నపురాయి సరిహద్దు దాటి తరలిపోతోంది.

సూర్యాపేట జిల్లా పరిధిలోని మఠంపల్లి మండలం రఘునాథపాలెం గ్రామ శివారులోని ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ లు 318, 258 లలో వందలాది ఎకరాల సున్నపురాయి గనులు ఉన్నాయి. పలుకుబడి ఉన్న నేతలకుతోడు.. కొందరు అవినీతి అధికారులు తోడవ్వడంతో ఈ అక్రమ సున్నపురాయి దళారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా.. ఏపీలోని పిడుగురాళ్ల, దాచేపల్లి ప్రాంతాల్లోని సున్నపు పరిశ్రమలకు ఎగుమతి చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత మైనింగ్, రెవన్యూ అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.

పగలూ-రాత్రీ తేడాలేకుండా.. ఇక్కడ సున్నపురాయి తవ్వకాలు జరుగుతున్నాయి. భారీ బ్లాస్టింగ్‌లు చేయడంతో.. పరిసర ప్రాంతాల పంట పొలాల్లోకి రాళ్లు ఎగిరి పడుతున్నాయి. ఇండ్లకు సైతం పగుళ్లు ఏర్పడుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. నిబంధనల ప్రకారం.. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం గంటలవరకు మైక్ ద్వారా అనౌన్స్ మెంట్, హెచ్చరికలు లేకుండా బ్లాస్టింగ్ చేయరాదు. అయితే.. అక్రమ తవ్వకాలు జరిపి సున్నపురాయిని తరలిస్తున్న అక్రమార్కులు నిబందనల్ని తుంగలో తొక్కి ఇష్టానుసారం బ్లాస్టింగ్ చేస్తున్నారు.

మఠంపల్లి పరిధిలో ఇటీవలే ఎలాంటి అనుమతులు లేకుండా మూడు భారీ సున్నపురాయి క్రష్షింగ్ మిల్లులు ఏర్పడ్డాయి. సున్నపురాయి గనుల నుంచి భారీ బండరాళ్లను తీసుకొచ్చి ఈ మిల్లులలో క్రష్షింగ్‌ చేసి చిన్నసైజు రాళ్లుగా మారుస్తారు. ఇక్కడినుంచి దాచేపల్లి, పిడుగురాళ్ల ప్రాంతాల్లోని సున్నపు పరిశ్రమలకు టన్నుల వారీగా ధరను నిర్ణయించి సరఫరా చేస్తుంటారు. ఇంత జరుగుతోన్నా.. మైనింగ్, రెవిన్యూ, పోలీసులు పట్టించుకోకపోవడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అంత భారీ పరిశ్రమలు ఏర్పాటు చేసినా.. అసలు అనుమతులు ఉన్నాయా..? లేదా..? ప్రభుత్వ శాఖల అనుమత లేకుండానే పరిశ్రమలు స్థాపించవచ్చా..? అనేది ప్రశ్నగానే మిగిలిపోతోంది. ఇప్పటికైనా.. సంబంధిత అధికారులు దృష్టి సారించి అక్రమ సున్నపు రాయి తవ్వకాలను అరికట్టి ప్రభుత్వం ఆస్తులను కాపాడాలని పలువురు కోరుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story