తాజా వార్తలు

హైదరాబాద్‌కు మరో ఐకాన్

హైదరాబాద్‌కు మరో ఐకాన్
X

హైదరాబాద్ కు మరో ఐకాన్ రాబోతుంది. అదే కమాండ్ కంట్రోల్ సెంటర్. ఇది అందుబాటులోకి వస్తే..అన్ని శాఖలతో సమన్వయం సాధ్యమవుతుందని పోలీస్ శాఖ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అత్యంత సాంకేతికత పరిజ్ఞానంతో నిర్మితమవుతున్న దీనిలో అనేక ప్రత్యేకతలున్నాయి. సీసీసీ నిర్మాణం తుదిదశకు చేరుకుంది.

హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ది చెందుతోంది. రాష్ట్ర ప్రజలకు మరింత భద్రత, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వేగంగా సేవలు అందించేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్ శరవేగంగా నిర్మాణం జరుగుతోంది. సుమారు 200ల కోట్లతో బంజారాహిల్స్ లోని రోడ్ నంబర్ 12లో సీసీసీ రూపుదిద్దుకుంటుంది. ఇందులో మొత్తం నాలుగు టవర్లు నిర్మిస్తున్నారు. ఏడెకెరాల సువిశాల స్థలంలో సుమారు ఐదు లక్షల చదరపు అడుగుల స్థలంలో సీసీసీ నిర్మాణం జరుగుతోంది. ఏ,బి,సీ,డీ లుగా టవర్ల నిర్మాణం చేస్తున్నారు. ఏ టవర్ 84.2 మీటర్లు, బి,సీ,డి టవర్లు 65.2 మీటర్లలో రూపుదిద్దుకుంటున్నాయి. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను రాష్ట్రంలోని అన్ని జిల్లాల సీసీసీలతో అనుసంధానం చేస్తారు. విపత్తులు సంభవించినప్పుడు దీని ద్వారా వివిధ శాఖల అధికారులను మానిటరింగ్ చేసే అవకాశం ఉంది. దసరా, వినాయక నిమజ్జనం, రంజాన్ సమయంలోనూ బందోబస్తు, రక్షణకు సంబంధించిన అంశాలపై దీని ద్వారా పర్యవేక్షించే వీలుంటుంది. రాష్ట్రంలోని అన్ని శాఖలను సీసీసీతో అనుసంధానం చేయడంవల్ల అన్ని శాఖలకు సంబంధించిన అంశాలను ఎప్పటికప్పుడు ఇక్కడి నుంచి మానిటరింగ్ చేసే వీలుంటుందని అధికారులు భావిస్తున్నారు. అత్యవసరంగా వెళ్లాల్సి వస్తే...సీసీసీపైన హెలిప్యాడ్ ఉంటుంది. అక్కడి నుంచి నేరుగా సంఘటనా స్థలానికి చేరుకునే అవకాశం ఉంది.

ఏ-టవర్ లో మొత్తం 20 అంతస్తులు ఉంటాయి. ఇందులో ఓపెన్ కార్యాలయం, మీటింగ్ గదులు, కాన్ఫరెన్స్ గదులు, క్యాబిన్స్ ఉంటాయి. వీటితో పాటు ముఖ్యమంత్రి క్యాబిన్, హోంశాఖ మంత్రి క్యాబిన్, సీపీ క్యాబిన్ లు ఉంటాయి. వీటితోపాటు ఒక మల్టీపర్సస్ గదిని ఏర్పాటు చేశారు. ఏ టవర్ పై హెలిప్యాడ్ ను నిర్మాణం చేస్తున్నారు. బి-టవర్ లో మొత్తం 15 అంతస్తులు ఉంటాయి. ఇందులో ఓపెన్ కార్యాలయం, మీటింగ్ గదులు, కాన్ఫరెన్స్ గదులు, క్యాబిన్ లు ఉంటాయి. ఇందులో డీజీపీ క్యాబిన్, సీ.ఎస్ క్యాబిన్, డయల్ 100లు ఉంటాయి. సీ-టవర్ లో 15 అంతస్తులు ఉంటాయి. ఇందులో సమావేశ మందిరం,ఇతర గదుల నిర్మాణం చేశారు. డీ-టవర్ లో 15 అంతస్తులు ఉంటాయి. ఇందులో మీడియా సమావేశాలకోసం, క్యాంటీన్, శిక్షణ తరగతుల కోసం గదుల నిర్మాణం చేశారు. ఇందులో 4,5,6,7 అంతస్తుల్లో డేటా సెంటర్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, మంత్రుల క్యాబిన్ లు, వార్ రూమ్ లు నిర్మించారు. వాహనాల పార్కింగ్ కోసం సువిశాల స్థలం కేటాయించారు. నాలుగు టవర్లను కలుపుతూ...ఐదు స్కైవే వంతెనల నిర్మాణం చేశారు. ఒక్కో వంతెనను 450 మెట్రిక్ టన్నుల బరుతో, 120 అడుగుల పొడవుతో నిర్మాణం చేశారు. ఈ స్కై వంతెనలు దేశంలోనే అత్యంత బరువైన వంతెనలు.

మరికొద్ది రోజుల్లోనే సీసీసీ నిర్మాణం పూర్తికాబోతుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్ అందుబాటులోకి వస్తే..అనేక అద్బుతాలు జరుగుతాయని పోలీస్ శాఖ అంచనా వేస్తోంది.

Next Story

RELATED STORIES