కోగంటి సత్యం చుట్టూ ఉచ్చు బిగుస్తోంది..

కోగంటి సత్యం చుట్టూ ఉచ్చు బిగుస్తోంది..

సంచలనం రేపిన పారిశ్రామికవేత్త రాంప్రసాద్‌ కేసులో.. ఆరోపణలు ఎదుర్కొంటున్న కోగంటి సత్యం చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. హైదరాబాద్‌లోని పంజాగుట్టలో నిన్న రాత్రి రాం ప్రసాద్‌ దారుణహత్యకు గురయ్యాడు. ఈ కేసు దర్యాప్తులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. వ్యాపార లావాదేవీలే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త కోగంటి సత్యం హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. రాంప్రసాద్ కుటుంబసభ్యులు సైతం ఈ హత్య వెనుక సత్యం హస్తం ఉందని పోలీసులకు చెప్పడంతో ఆయన చుట్టూనే దర్యాప్తు కొనసాగుతోంది.

ఈ హత్యకేసులో తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు కోగంటి సత్యం. తాను ఎవరినీ హత్య చేయలేదన్నారు. రాం ప్రసాద్‌ను చంపితే తనకు రావాల్సిన డబ్బు ఎలా వస్తుందని ఎదురు ప్రశ్నించారు. తనకు ఇవ్వాల్సిన డబ్బును ఎగ్గొట్టడానికే తనపై అనేకసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసి తప్పుడు కేసులు బనాయించారని చెప్పుకొచ్చారు.

పోలీసులు మాత్రం వ్యాపారా లావా దేవీల చుట్టే ప్రస్తుతం దర్యాప్తును కొనసాగిస్తున్నారు. విజయవాడకు సమీపంలోని కొండపల్లి దగ్గర చాలా ఏళ్ల కిందట కోగంటి సత్యం, టీడీపీ నేత బోండా ఉమా కలిసి కామాక్షి స్టీల్ కంపెనీ ప్రారంభించారు. అయితే వ్యాపార లావాదేవీల్లో ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో ఉమా ఆ కంపెనీని తనకు తెలిసిన స్టీల్ వ్యాపారి రాంప్రసాద్‌కు ఆరేళ్ల కిందట లీజుకు ఇప్పించారు. కామాక్షి స్టీల్స్ కంపెనీలో నష్టాలు రావడంతో రాంప్రసాద్ కొంత కాలానికే ఆ కంపెనీ లీజును రద్దు చేసుకున్నారు. అయితే కంపెనీ లీజుతో పాటు కరెంట్ బిల్లులన్నీ కలిపి రాంప్రసాద్ తనకు 70కోట్ల రూపాయలు ఇవ్వాలని కోగంటి సత్యం అప్పట్లో ఆరోపించారు. ఇద్దరి మధ్య వివాదం నడుస్తుండగానే 2014 ఎన్నికలకు ముందు రాంప్రసాద్‌ను ఆయన కిడ్నాప్ చేయించారు.

అప్పడు కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన విజయవాడ పోలీసులు కోగంటి సత్యంను అదుపులోకి తీసుకుని రాంప్రసాద్‌ను విడిపించారు. ఈ కేసులో 18 రోజులపాటు జైల్లో గడిపిన సత్యం బెయిల్‌పై విడుదలయ్యారు. బోండా ఉమా తనను అన్యాయంగా కిడ్నాప్ కేసులో ఇరికించారని అప్పట్లో ఆరోపించిన ఆయన కామాక్షి స్టీల్స్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించారు. సత్యంతో విబేధాల నేపధ్యంలో బోండా ఉమా ఆ ఫ్యాక్టరీ నుంచి పూర్తిగా వైదొలిగారు. అయితే లీజుకు సంబంధించి తనకు రావాల్సిన 70 కోట్ల విషయమై రాంప్రసాద్‌ను సత్యం తరుచూ బెదిరించినట్టు ఫిర్యాదులు ఉన్నాయి.

ఇదే విషయమై కోగంటి సత్యం బెదిరిస్తున్నాడని, ఆయన్నుంచి ప్రాణహాని ఉందని రాంప్రసాద్ కొంతకాలం కిందటే ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఆయన దారుణహత్యకు గురికావడం కలకలం రేపింది. రాంప్రసాద్ భయపడినట్లే హత్యకు గురికావడంతో దీని వెనుక సత్యం హస్తం ఉందన్న అనుమానాలు ఇంకాస్త బలపడుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story