కర్ణాటకలో రాష్ట్రపతి పాలన విధిస్తారా?

కర్ణాటకలో రాష్ట్రపతి పాలన విధిస్తారా?
X

కర్ణాటకలో ఏం జరగబోతోంది? 13 నెలల సంకీర్ణ ప్రభుత్వానికి తెరపడినట్లేనా? స్పీకర్ రమేష్ కుమార్ రాజీనామాలు ఆమోదిస్తారా? గవర్నర్ వజూభాయ్ వాలా ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానిస్తారా? లేక రాష్ట్రపతి పాలన విధిస్తారా? రాబోయే 24 గంటల్లో కర్ణాటక రాజకీయాలు ఎలాంటి టర్న్ తీసుకోబోతున్నాయ్..అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతానికి బంతి మాత్రం స్పీకర్‌ కోర్టులోనే కనిపిస్తోంది. స్పీకర్‌ ముందు నాలుగు ఆప్షన్లు కనిపిస్తున్నాయి..

ప్రస్తుతం బంతి స్పీకర్ కోర్టులో ఉంది.. సభాపతి రమేష్ కుమార్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే రాజీనామా చేసిన 13 మందిని కలిపితే ఆయన దగ్గర మొత్తం 14 రాజీనామా లేఖలు పెండింగ్ లో ఉన్నాయి. స్పీకర్ తీసుకునే నిర్ణయంపైనే సంకీర్ణ ప్రభుత్వం భవిష్యత్ ఆధారాపడి ఉంటుంది. ప్రస్తుతానికి ఆయన ముందు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. రాజీనామాలను వెంటనే ఆమోదించడం లేదా వాయిదా వేయడం.. అదీ కుదరకపోతే రాజీనామా చేసిన ఎమ్మెల్యేల నుంచి వివరణ పేరుతో కాలయాపన చేయోచ్చు. ఎలాంటి కారణాలు లేకుండా రాజీనామాలను ఎక్కువ సేపు పెండింగ్ లో ఉంచితే.. తీవ్ర విమర్శలకు ఆస్కారం ఉంది.. మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా చేజారిపోయే ప్రమాదం ఉంటుంది..

కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలున్నాయి. ఇందులో బీజేపీ-105, కాంగ్రెస్-78, జేడీఎస్‌కి 37 స్థానాలున్నాయి. మ్యాజిక్ ఫిగర్ 113. ప్రస్తుతం కాంగ్రెస్-జేడీఎస్‌లకు 115 మంది ఎమ్మెల్యేలున్నారు. బీఎస్పీ, ఇద్దరు స్వతంత్రులు, నామినేటెడ్ ఎమ్మెల్యేతో కలిపి ఆ బలం 119కి పెరిగింది. ఐతే, 14 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ప్రభుత్వ బలం 105కు పడిపోయింది. అటు కేపీజేపీ ఎమ్మెల్యే మద్దతుతో బీజేపీ బలం 106కు పెరిగింది. ఒకవేళ శాసనసభ్యుల రాజీనామా లను స్పీకర్ ఆమోదిస్తే ప్రభుత్వం కుప్పకూలిపోతుంది.

ప్రభుత్వం కుప్పకూలితే.. గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది వేచి చూడాలి. సంకీర్ణ సర్కారును బలం నిరూపించుకోమంటారా? అతిపెద్ద పార్టీ అయిన బీజేపీకి అవకాశమిస్తారా? అనేదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. లేదంటే ఏకంగా రాష్ట్రపతి పాలన విధించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.! బీజేపీ కూడా ఇదే కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే అరకొర మెజార్టీతో ఇబ్బంది పడే బదులు... మళ్లీ ఎన్నికలకు వెళ్లి బంపర్ మెజార్టీతో విజయం సాధించవడమే బెటర్ అని కొందరు భావిస్తున్నారు..

Next Story

RELATED STORIES