అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం: కేసీఆర్‌

అవినీతికి ఆస్కారం లేని పాలనే తన లక్ష్యం అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. ప్రజలకు పారదర్శకంగా సేవలు అందేలా, ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి జరగాలి అన్నారు. ఆ విధంగా తెలంగాణ రాష్ట్ర నూతన అర్బన్ పాలసీ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అర్బన్, రూరల్, రెవెన్యూ పాలసీలతో పాటు కార్పొరేషన్‌ల కోసం నూతన చట్టాల రూపకల్పనపై ఉన్నతాధికారులతో సమీక్ష చేసిన ఆయన పలు సూచనలు చేశారు.

పారదర్శకంగా ప్రణాళికాబద్ధ రీతిలో అభివృద్ధి జరిగేలా తెలంగాణ నూతన అర్బన్‌ పాలసీని రూపొందించాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష చేసిన సీఎం.. కొత్త అర్బన్‌ పాలసీ విధివిధానాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అర్బన్‌ పాలసీతో పాటు నూతన గ్రామీణ రెవెన్యూ విధానాలను రూపొందించాలని ఆదేశించారు. నూతన అర్బన్‌ పాలసీలో భాగంగా కొత్తగా మున్సిపాలిటీ, కార్పొరేషన్, హైదరాబాద్‌ నగర కార్పొరేషన్‌ చట్టాలను తీసుకురావాలన్నారు. రెండు మూడు రోజుల్లోనే ఈ చట్టాల ముసాయిదా తయారు చేయాలని సూచించారు.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో రాష్ట్ర ప్రాధాన్యతలు గుర్తించామన్నారు సీఎం కేసీఆర్‌. సంక్షేమ రంగానికి అధిక ప్రాధాన్యమిచ్చామని చెప్పారు. విద్యుత్‌ సంక్షోభం, తాగునీటి సమస్యలను పరిష్కరించుకున్నామన్నారు. సాగునీటి కోసం ప్రాజెక్టులు కడుతున్నామని.. పారిశ్రామికాభివృద్ధికి టీఎస్‌ ఐపాస్‌ చట్టం చేశామని సీఎం వివరించారు.

అవినీతి జరగడానికి ఆస్కారం లేకుండా, అక్రమ కట్టడాలకు ఏ మాత్రం వీలులేకుండా, పచ్చదనం పరిశుభ్రత వెల్లివిరిసేలా నగరాలు, పట్టణాలను తీర్చిదిద్దడానికి ఉపయోగపడే విధంగా కొత్త చట్టాలు ఉండాలన్నారు. ఈ చట్టాల ప్రకారమే నగల పాలన జరిగే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులకు బాధ్యత అప్పగించాలన్నారు. బాధ్యతలను విస్మరించిన వారిపై కఠిన చర్యలు తీసుకునే అధికారం కూడా చట్టమే కల్పిస్తుందని స్పష్టం చేశారు. త్వరలోనే అసెంబ్లీని సమావేశ పరిచి కొత్త చట్టాలు తెస్తామని అధికారులకు సీఎం తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రం మరో మెట్టు ఎక్కాలని.. దీనికోసం మంచి విధానాలు రావాల్సిన అవసరముందని కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. గ్రామాల వికాసానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరించడానికి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు చోట్ల పంచాయతీ రాజ్ సమ్మేళనాలను నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. జడ్పీలు పంచాయతీల బలోపేతానికి ఏటా దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలను కేటాయిస్తామన్నారు. గ్రామాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలను కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ఇందుకోసం త్వరలోనే హైదరాబాద్ లో కలెక్టర్లకు అవగాహన సదస్సు నిర్వహించాలని అధికారులకు సిఎం కేసీఆర్‌ చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story