రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు గోదావరి నీరు : సీఎం జగన్

రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు గోదావరి నీరు : సీఎం జగన్

అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే సంక్షేమ పథకాల అమలుకు చర్యలు తీసుకున్నామని ఏపీ సీఎం జగన్ వివరించారు. జమ్మలమడుగులో నిర్వహించిన రైతు దినోత్సవంలో పాల్గొన్న జగన్.. వైఎస్సార్‌ పెన్షన్‌ పథకం కింద అవ్వాతాతలకు 2 వేల 250, దివ్యాంగులకు 3 వేలు, డయాలసిస్‌ పేషంట్లకు 10 వేల రూపాయలు మంజూరు చేస్తున్నామని చెప్పారు. కడప జిల్లాకు గతంలో కంటే రెట్టింపుగా 70 కోట్లు పెన్షన్‌గా ఇస్తున్నామని చెప్పారు. పెన్షన్‌ పథకానికి 15 వేల 676 కోట్లు కేటాయించామన్నారు. పెన్షన్‌ రాని అర్హులు నేరుగా సీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేయొచ్చని సూచించారు. తప్పులు చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంక్షేమ పథకాల అమలులో కులాలు, మతాలు, వర్గాలు పరిగణించమని సీఎం పునరుద్ఘాటించారు.

రైతులందరికీ సున్నా వడ్డీకే రుణాలందిస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు. రైతులకు ఉచితంగా పగటిపూట 9 గంటల కరెంట్‌ ఇస్తామని వెల్లడించారు. అక్టోబర్‌ 15 నుంచి వైఎస్సార్‌ రైతు భరోసా కింద 12 వేల 500 ఇస్తామని తెలిపారు. రైతుల పంట రుణాల కింద 8 వేల 750 కోట్లు ఇస్తామన్నారు. తమ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుందని ఉద్ఘాటించారు. వైఎస్సార్‌ పంటల బీమా పథకానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఖరీఫ్, రబీలలో సాగు చేసే 27 రకాల పంటలకు రైతులు చెల్లించాల్సిన ప్రీమియం వాటాను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు.

ప్రతి నియోజకవర్గంలో కోల్డ్‌ స్టోరేజ్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, వ్యవసాయ ల్యాబోరేటరీలు ఏర్పాటు చేసి.. రైతులకు నాణ్యమైన పురుగు మందులు, ఎరువు, విత్తనాలు ఇస్తామని వెల్లడించారు. వ్యవసాయ మిషన్‌ ఏర్పాటు చేసి ప్రతినెలా రైతు సమస్యలపై సమీక్ష చేస్తున్నామని తెలిపారు. పులివెందులలో అరటి పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని వెల్లడించారు. ప్రమాదవశాత్తు రైతు మరణించినా.. ఆత్మహత్య చేసుకున్నా ఆ కుటుంబానికి 7 లక్షల చెక్‌ ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు.

ఇక శ్రీశైలం ప్రాజెక్టులోకి గోదావరి నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు సీఎం జగన్. కృష్ణా ఆయకట్టును సస్యశ్యామలం చేస్తామని తెలిపారాయన. రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు గోదావరి నీరు అందిస్తామన్నారు. కుందూ నదిపై ప్రాజెక్ట్‌లను డిసెంబర్ 26న ప్రారంభిస్తామని తెలిపారు. కుందూ నుంచి ఎత్తిపోతల ద్వారా బ్రహ్మసాగర్‌కు నీళ్లిస్తామని హామీ ఇచ్చారు. కడప ఉక్కు ఫ్యాక్టరీకి డిసెంబర్ 26న శంకుస్థాపన చేస్తామన్నారు జగన్.

ఖరీఫ్‌ సీజన్‌​ వచ్చిన వెంటనే నవంబర్‌​ నుంచి విత్తనాలు కొనుగోలు చేసి మే నాటికి అందుబాటులోకి తేవాలని చెప్పారు. గతంలోని చంద్రబాబు ప్రభుత్వం విత్తనాల కొనుగోలును పట్టించుకోలేదని... బకాయిలు కూడా చెల్లించలేదని ఆరోపించారు. దీనిపై వ్యవసాయశాఖ అధికారులు చంద్రబాబుకు లేఖలు రాశారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే విత్తన బకాయిలు చెల్లించామని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story