రికార్డుస్థాయిలో కురిసిన వర్షం.. కార్లపైకి ఎక్కి హాహాకారాలు..

రికార్డుస్థాయిలో కురిసిన వర్షం..  కార్లపైకి ఎక్కి హాహాకారాలు..

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో రికార్డుస్థాయిలో వర్షం కురిసింది. సాధారణంగా కొన్ని గంటల తరబడి వర్షం కురిస్తే.. వరదలు వచ్చే ప్రమాదం ఉంటుంది. కానీ కేవలం ఒక గంట వ్యవధిలో కురిసిన వర్షం నగరంలో జనజీవనాన్ని భయకంపితులను చేసింది. ఎంతలా అంటే కార్లలో ఉన్నవారు చూస్తుండగానే వరదల్లో చిక్కుకొని ప్రాణాలు కాపాడుకోవడానికి నరకయాతన పడ్డారు. ప్రాణ భయంతో కార్లపైకి ఎక్కి సహాయం కోసం హాహాకారాలు చేశారు.

వెంటనే అప్రమత్తమైన పైర్ సిబ్బంది వరదల్లో చిక్కుకున్న 15మంది వాహన డ్రైవర్లను రక్షించారు. రీగన్ జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం 9 గంటలనుంచి 10గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 3.3 అంగులాల వర్షపాతం అంటే 8.4 సెంటీమీటర్లు కురిసినట్లు జాతీయ వాతావరణ శాఖ వెల్లడించింది. 1958 లో కురిసిన 5.6 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డును ఇది అధిగమించినట్లు తెలిపింది. కేవలం గంటపాటు కురిసిన వర్షం ఒక రోజు కురిసిన వర్షం రికార్డును బ్రేక్ చేసినట్లు వాతావరణ అధికారులు తెలిపారు.

అమెరికా వాయవ్యప్రాంతంలోని వర్జీనియా, అర్లింగ్టన్ లో కురిసిన వర్షం మరో రికార్డు సృష్టించింది. ఒక గంట సమయంలో 12.7 సెంటీమీటర్ల వర్షం పడిందని వాతావరణ శాఖ అధికారి చెనార్డ్ వెల్లడించారు. కుండపోత వర్షానికి మెట్రోస్టేషన్ లోకి నీళ్లు వచ్చాయి. అలాగే వాషింగ్టన్ లోని చారిత్రక మ్యూజియం, స్మారక కేంద్రాలను తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు తెలిపారు. పరిస్థితి భయానకంగా మారడంతో ఫైర్, రెస్క్యూ సిబ్బంది రబ్బర్ లైఫ్ బోట్స్ రంగంలోకి దిగి రోడ్లపై వరదల్లో చిక్కుకున్నవారిని రక్షించారు. అయితే భారీవర్షాలు అధ్యక్ష భవనం వైట్ హౌజ్ ను కూడా తాకాయి. వైట్ హౌజ్ లోని బేజ్ మెంట్ ఆఫీసులోకి వరద నీరు చేరిందంటూ సిఎన్ ఎన్ రిపోర్టర్ బెట్సీ తమ ట్విట్టర్ లో తెలిపారు.

అయితే కుండపోత వర్షానికి నగరంలోని జనజీవనం అస్థవ్యస్థమైంది. వాహనాలు, రైళ్లు నిలిచిపోయాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ నిలిచిపోయింది. స్కూళ్లకు, కార్యాలయాలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అయితే పరిస్థితి ప్రమాద కరంగా ఉండటంతో అధికారులు స్థానిక ఎమర్జెన్సీని విధించి సహాయక చర్యలను చేపట్టారు. మరోవైపు ఒక రోజు ముందువరకు ఈ నగరంలోనే తానా మహాసభలు వైభవంగా జరిగాయి. దేశంలోని ఎన్నారైలతోపాటు తెలుగు ప్రముఖులు, సినీ నటులు పాల్గొన్నారు. తానా కన్వెన్షన్ ముగిసిన తర్వాత వర్షం కురియడంతో తానా ప్రతినిధులు ఊపిరి పీల్చుకున్నారు. ఒక్కరోజు ముందుకురిసుంటే వేడుకల్లో పాల్గొన్న వేలాదిమంది తెలుగువారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారని ఎన్నారైలు అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story