రేపటి నుంచి ఏపీ బడ్జెట్‌ సమావేశాలు

రేపటి నుంచి ఏపీ బడ్జెట్‌ సమావేశాలు

ఏపీ బడ్జెట్ సమావేశాలు రేపు ప్రారంభం కానున్నాయి. ఇందు కోసం అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో గవర్నర్ నరసింహన్ తో సమావేశమైన సీఎం జగన్.. బడ్జెట్ కేటాయింపులతో పాటు, సభ నిర్వహణపై చర్చించారు. మరోవైపు.. శాసనసభ అధికారులు, పోలీసులతో సమీక్ష నిర్వహించిన స్పీకర్ తమ్మినేని సీతారాం.. ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు.

ఏపీ బడ్జెట్ సమావేశాలు గురువారం ప్రారంభంకానున్నాయి. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి 12న సభలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌.. గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ అయ్యారు. విజయవాడకు వచ్చిన గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం దాదాపు గంటపాటు వివిధ అంశాలపై చర్చించారు. బడ్జెట్ లో వివిధ శాఖలకు కేటాయింపులు, ప్రాధాన్యాలు, ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ తదితర అంశాలపై జగన్‌ గవర్నర్‌తో చర్చించినట్లు సమాచారం. అలాగే కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్న విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుకు నిధులు కేటాయించకపోవడం, విభజన చట్టంలోని పలు సమస్యల పరిష్కారం తదితర అంశాలపైనా గవర్నర్‌తో సీఎం జగన్ చర్చించినట్లు సమాచారం.

అటు.. స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఏపీ బడ్జెట్‌ సమావేశాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఐఏఎస్‌ అధికారులతో జరిగిన సమావేశంలో పలు సూచనలు చేశారు. వాస్తవిక దృక్పథంతో అసెంబ్లీ నడిచేలా కృషి చేద్దామన్నారు. ఈసారి 70 మంది సభ్యులు తొలిసారి సభలో అడుగుపెట్టారు. మాట్లాడేందుకు అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. గత అసెంబ్లీ సమావేశాల్లో ఉద్దేశ పూర్వకంగానే కొన్ని అంశాలు చర్చకు రాకుండా చేశారని.. ఈసారి అలాంటి పరిస్థితి ఉండదన్నారు స్పీకర్ తమ్మినేని.

సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సకాలంలో సమాధానాలు సిద్ధం చేసేలా ఉండాలని సూచించారు స్పీకర్. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఒక బృందంగా పనిచేసి శాసనసభ గౌరవాన్ని పెంచాలన్నారు. ప్రభుత్వ బిల్లులను వాటి ఉద్దేశాలను అధ్యయనం చేసిన తర్వాతే ముసాయిదాను సభ ముందు ఉంచాలన్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో భద్రతపైన పోలీసు ఉన్నతాధికారులతో స్పీకర్‌ సమీక్ష చేశారు. భద్రతా ఏర్పాట్లు, బందోబస్తు సమన్వయం కోసం అసెంబ్లీ ఆవరణ బయట ఓ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అసెంబ్లీ సందర్శకుల సంఖ్యను పరిమితం చేయాలని స్పీకర్‌ ఆదేశించారు. రోజుకు 500 మందినే అనుమతించాలన్నారు.

Tags

Read MoreRead Less
Next Story