మేము కూడా రౌడీయిజం చేస్తే మీరెక్కడ ఉండేవారు?:చంద్రబాబు

టీడీపీ కార్యకర్తలను కాపాడుకునేందుకు ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. నేరాలు, ఘోరాలు, హత్యలను ఎవరూ ఒప్పుకోరని.. ప్రజలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితులు కల్పించాలన్నారు. కడప, అనంతపురం జిల్లాల్లో పర్యటించిన చంద్రబాబు.. కార్యకర్తల్లో మనోధైర్యం నింపారు.

ఏపీలో దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్న తీరు రౌడీ రాజ్యాన్ని తలపిస్తోందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. చివరికి మీడియాను కూడా బెదిరించేంతగా వైసీపీ నేతల ఆగడాలు హద్దుమీరాయని అన్నారు. ఎన్నికల తర్వాత ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలుపోటములను సాధారణంగా భావించాలని.. దాడులు, దౌర్జన్యాలతో ప్రజలను భయపెట్టి పాలించే ఆలోచనలు మంచివి కావని సూచించారు. ఎన్నికల సమయంలో, ఎన్నికల తర్వాత టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు జరుగుతుండటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ కార్యకర్తలపై వైసీపీ దాడులు పెరిగిపోవడంపై చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం కడప, అనంతపురం జిల్లాల్లో ఆయన పర్యటించారు. అనంతపురం జిల్లా బత్తలపల్లిలో వైసీపీ దాడుల్లో మృతి చెందిన గుల్ల రాజు కుటుంబాన్ని పరామర్శించాడు. ఎన్నికల సమయంలో జరిగిన ఘర్షణల్లో ఆయన హత్యకు గురయ్యాడు. రాజు కుటుంబానికి 5 లక్షల సాయం అందించిన చంద్రబాబు...రాష్ట్రంలో ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.

తాడిపత్రి మండలం వీరాపురం గ్రామంలో పోలింగ్ రోజున జరిగిన ఘర్షణల్లో మృతి చెందిన చింతా భాస్కర్ కుటుంబాన్ని కూడా చంద్రబాబు పరామర్శించారు. మృతుడి భార్య లక్ష్మీదేవి పోలింగ్ రోజున తన భర్తను దారుణంగా హత్య చేశారని చంద్రబాబుకు తన ఆవేదన వెళ్లబోసుకుంది. హంతకులను వదలొద్దని..కఠిన శిక్ష పడేలా చూడాలని కోరింది.

అంతకు ముందు కడప విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబు ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్య రాజ్యమా? రౌడీ రాజ్యమా? అని ప్రశ్నించారు. మేము కూడా రౌడీయిజం చేస్తే మీరెక్కడ ఉండేవారు? అని అన్నారు. చివరికి మీడియా, కార్పోరేట్ వర్గాలను కూడా వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని ఆరోపించారు. రిపోర్టర్లపై దాడులకు తెగబడుతున్నారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వ్యక్తిగతంగా దాడులు చేయటం సరికాదు.. పార్టీలు సిద్ధాంతపరంగా పోరాడాలని వైసీపీకి హితవు చెప్పిన మాజీ సీఎం చంద్రబాబు.. రౌడీ పాలనకు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story