లోక్ సభలో రాహుల్ గాంధీకి సీటు కేటాయింపు వివాదం

లోక్ సభలో రాహుల్ గాంధీకి సీటు కేటాయింపు వివాదం

లోక్ సభలో రాహుల్ గాంధీకి సీటు కేటాయింపు వివాదంపై కాంగ్రెస్ క్లారిటీ ఇచ్చింది.. రాహుల్ కు ముందు వరుసలో సీటు కేటాయించాలని తామెప్పుడూ కోరలేదని స్పష్టం చేసింది. ఫస్ట్ లైన్ లో సీటు కోసం కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఇటీవల వార్తలు వచ్చాయి. కాంగ్రెస్‌ లోక్‌సభా పక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌధరీ దీనిపై వివరణ ఇచ్చారు. మీడియాలో వస్తున్నదంతా కేవలం ప్రచారమేనని ట్వీట్ చేశారు.

లోక్ సభలో పార్టీకి ఉన్న సంఖ్యా బలం ఆధారంగా ఆయా పార్టీలకు ముందు వరుసలో సీట్లు కేటాయిస్తారు. కాంగ్రెస్‌ నేతలు సోనియా గాంధీ, అధీర్‌ రంజన్‌ చౌధరీ కోసం ముందు వరుసలో రెండు సీట్లు కేటాయించారు. దీంతో రాహుల్‌ కోసం అదనంగా మరో సీటు ఇవ్వాలని ఆ పార్టీ డిమాండ్‌ చేసినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ వార్తలు అవాస్తవమని చౌధరీ ట్వీట్‌ చేశారు. రాహుల్‌ కోసం తాము 466వ సీటును ప్రతిపాదించినట్లు తెలిపారు. తాజాగా జరుగుతున్న సమావేశాల్లో రాహుల్‌.. సోనియాగాంధీ పక్కనే కూర్చుని కన్పించారు.

సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్‌ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయనకు నచ్చజెప్పేందుకు పార్టీ నేతలు ప్రయత్నించినప్పటికీ ఫలించలేదు. రాజీనామాపై రాహుల్‌ వెనక్కి తగ్గకపోవడంతో కాంగ్రెస్‌ కొత్త అధ్యక్షుడిని అన్వేషించే పనిలో ఉంది. అయితే కొత్త అధ్యక్షుడు ఎవరనే అంశంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.

Tags

Read MoreRead Less
Next Story