మార్కాపురంలో చెలరేగిపోతున్న కబ్జా రాయుళ్లు..

మార్కాపురంలో చెలరేగిపోతున్న కబ్జా రాయుళ్లు..

ప్రకాశం జిల్లాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణం మార్కాపురంలో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు.ఎక్కడ ఖాళీ జాగా కనిపిస్తే అక్కడ జెండా పాతేస్తున్నారు. వారి కళ్ళు ఇప్పుడు ఓ చెరువుపైనా పడ్డాయి. పట్టణానికి ప్రధాన నీటినవరుగా ఉన్న చెరువును కూడా వదలడం లేదు. ఇప్పటికే వంద కోట్ల రూపాయల విలువైన భూమి కబ్జా కోరల్లో చిక్కుకుంది.

పట్టణంలోని సర్వే నెంబర్ 549లో 584.36 ఎకరాలు, 474లో 3.32 ఎకరాలు, 475లో 1.32 ఎకరాలు, 476లో 9.74 ఎకరాలు, 477లో 0.64 ఎకరాలు, 497లో 11.87 ఎకరాల్లో చెరువు విస్తరించి ఉంది. సుమారు 6వందల ఎకరాల్లో ఉంది. పట్టణం పరిధి పెరుగుతుండడంతో చెరువు చుట్టుపక్కల కూడా పెద్ద ఎత్తున నిర్మాణాలు వెలిశాయి. ఎస్సీ, బీసీ కాలనీలు, లక్ష్మీచెన్నకేశవనగర్, విద్యానగర్, పూల సుబ్బయ్య కాలనీ, డ్రైవర్స్ కాలనీ, నాలుగో తరగతి ఉద్యోగుల కాలనీలు వచ్చాయి. దీంతో ఈ ప్రాంతం అత్యంత విలువైనదిగా మారిపోయింది. ఎకరం కోటికి పైగా పలుకుతోంది. దీంతో కబ్జారాయుళ్ల కన్ను పక్కనే ఉన్న చెరువు భూములపై పడింది.

ఇప్పటికే చెరువకు చెందిన వంద ఎకరాలు కబ్జాకు గురైనట్టు తెలుస్తోంది. అక్రమ నిర్మాణాలు వెలిశాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో ఇప్పుడు ఏకంగా చెరువు గర్భంలోనే ఇళ్లు నిర్మిస్తున్నారు. 6వందల ఎకరాల చెరువు విస్తీర్ణం తగ్గిపోతోంది. వర్షాలు లేక చెరువు నిండకపోవడంతో చెరువు ఏడారిలో ఉండడంతో కబ్జారాయుళ్లకు కనకవర్షం కురిపిస్తోంది. తప్పుడు పత్రాలతో భూములు తమవేనని కొందరు అడ్డగోలుగా విక్రయిస్తున్నారు. దీనిపై ఫిర్యాదులు వచ్చినా అధికారులు రాజకీయ ఒత్తిడితో చర్యలకు వెనక్కు తగ్గుతున్నట్టు ఆరోపణలున్నాయి.

అధికారులు కూడా చెరువు భూమి ఆక్రమణకు గురైనట్టు గుర్తించారు. త్వరలోనే సర్వే చేసి అక్రమణదారులపై చర్యలు తీసుకుంటామని రెవిన్యూ అధికారులు చెబుతున్నారు. ఇందుకు పోలీసుల సాయం కూడా తీసుకుంటామంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story