పెరిగిన వర్షాల జోరు.. స్తంభించిపోయిన జనజీవనం

పెరిగిన వర్షాల జోరు.. స్తంభించిపోయిన జనజీవనం

ఉత్తర, ఈశాన్య భారతాల్లో వర్షాల జోరు పెరిగింది. ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడున్నాయి. అసోంలో 3 రోజులుగా భారీ వానలు పడుతున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో ప్రధాన నదులు పొంగి ప్రవహించాయి. వరద నీటితో నదులు ఉప్పొంగడంతో దాదాపు పది జిల్లాల్లో జనజీవనం స్తంభించిపోయింది. దీమాజీ, లఖింపూర్, బార్పేట, చిరాంగ్, గోలాఘాట్, జోర్హాట్, దిబ్రూఘడ్ జిల్లాల్లో 145 గ్రామాలు నీట మునిగాయి.

అసోంలో బ్రహ్మపుత్ర నది ప్రమాదకరస్థాయిని దాటి ప్రవహిస్తోంది. నిమతీ ఘాట్, ధనసిరి, గోలాఘాట్, సో నిట్‌ పూర్, కామ్‌రూప్, బార్పేట వంతెనల వద్ద బ్రహ్మపుత్ర నది డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వరదలతో రోడ్లు, వంతెనలు, కల్వర్టులు దెబ్బతిన్నాయి. వేలాది ఎకరాల పంట నీట మునిగింది. లోతట్టు ప్రాంతాల్లో నివాసముంటున్న 65 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద బాధితుల కోసం ప్రభుత్వం షెల్టర్ జోన్స్ ఏర్పాటు చేసింది.

అరుణాచల్‌ప్రదేశ్‌, మేఘాలయాల్లోనూ భారీ వర్ష పాతం నమోదవుతోంది. అరుణాచల్‌ప్రదేశ్‌లో అనేక చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. వరదల ధాటికి వంతెనలు కొట్టుకు పోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజల ను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఉత్తర భారతంలో గంగమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో గంగానదికి వరద పోటెత్తుతోంది. రిషికేశ్ వద్ద గంగ ఉగ్రరూపం దాల్చింది. పలు చోట్ల కొండచరియలు కూడా విరిగి పడ్డాయి. అటు వరద పోటు, ఇటు ప్రకృతి వైపరీత్యంతో అధికారయంత్రాంగం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాలు, నది తీర ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story