కూతుర్ని కాటేసిందని పాముని పట్టుకునేసరికి..

కూతుర్ని కాటేసిందని పాముని పట్టుకునేసరికి..

పాముని చూస్తే పరుగులు పెడతాం. ఇక అది కాటేస్తే అంతే సంగతులు. విషం శరీరం మొత్తం పాకకుండా ఉండాలని వెంటనే ఆసుపత్రికి పరిగెడతాం. అలాంటిది ఓ మహిళ తనను కాటేసిన పాముని అత్యంత చాకచక్యంగా పట్టుకుని మరీ ఆసుపత్రికి వెళ్లింది. అదీ తనను కాటేసింది భయంకరమైన విషసర్పమని తెలిసి కూడా. ముంబయిలోని ధారావీ ప్రాంతానికి చెందిన సుల్తానా ఖాన్ అనే మహిళ తన కుమార్తెతో కలిని ఉదయం పూట టిఫిన్ చేస్తోంది. ఆ సమయంలో ఇంట్లోకి ఓ పాము దూరింది. చూస్తుండగానే ఆ పాము తన కూతురిని కాటేసింది. దీంతో సుల్తానా పాముని పట్టుకోవడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో పాము ఆమెని కూడా కాటేసింది. అయినా కూడా భయపడకుండా ఎట్టకేలకు పాముని పట్టుకుంది.

దాన్ని తీసుకుని కూతురితో పాటు హాస్పిటల్‌కు వెళ్లింది. అక్కడికి వెళ్లి పాముని వైద్యుడికి చూపించి.. అది తమని కాటేసిందని చెప్పి వెంటనే చికిత్స చేయమని కోరింది. అది ఏ పామో తెలుసుకున్న వైద్యుడు దానికి అనుగుణంగా చికిత్స అందించారు. అనంతరం వారిని సియోన్ హాస్పిటల్‌కు తరలించారు. నాలుగు రోజులపాటు తల్లీ కూతుర్లిద్దరిని అబ్జర్వేషన్‌లో ఉంచామని వైద్యులు తెలిపారు. నిజానికి పాము కాటుకు చికిత్స అందించాలంటే అది ఏ పామో తప్పనిసరిగా తెలిసి ఉండాలి. అప్పుడే చికిత్స అందించడం వైద్యులకు సులువు అవుతుంది. ఈ విషయంపై అవగాహన ఉన్న సుల్తానా కాటేసిన పాముని ధైర్యంగా పట్టుకుంది. ముంబయిలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పాములు నివాస ప్రాంతాల్లోకి చొరబడుతున్నాయి. అందులో సుల్తానా ఇల్లు నేచర్ పార్క్ సమీపంలో ఉంది. వారిని కాటేసిన పాము రక్త పింజర అని తెలిసింది.

Tags

Read MoreRead Less
Next Story