Top

రాజీనామా దిశగా మరో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు?

రాజీనామా దిశగా మరో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు?
X

కర్నాటకం కంటిన్యూ అవుతోంది. అసంతృప్త ఎమ్మెల్యేలు పట్టు వీడటం లేదు. స్పీకర్ మెట్టుదిగడం లేదు. సుప్రీం కోర్టు జోక్యం చేసుకున్నా రాజకీయ సంక్షోభంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇక ఇవాళ్టి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కీలకమైన ద్రవ్య బిల్లును సభ ఆమోదించాల్సి ఉంది. ఇప్పటికే కాంగ్రెస్-జేడీఎస్ తమ ఎమ్మెల్యేలకు విప్ జారీచేసింది. శాసనసభ సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించింది. రాజీనామాలు చేసిన 16 మంది అసంతృప్తులు ముంబైలోనే మకాం వేశారు. వాళ్లు అసెంబ్లీ సమావేశాలకు వచ్చే అవకాశం ఎలాగూ లేదు. అప్పుడు పార్టీ ఇచ్చిన విప్ ను ధిక్కరించినట్లు అవుతుంది. మరి దీనిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అటు కర్ణాటక అసెంబ్లీ వద్ద పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. ఇంటెలిజెన్స్‌ హెచ్చరికలతో విధానసౌధకు 2 కిలోమీటర్ల పరిధిలో 144 సెక్షన్‌ కింద నిషేధాజ్ఞలు విధించారు. ఈ ప్రాంతంలో ఐదుగురి కంటే ఎక్కువమంది గుమిగూడేందుకు వీల్లేదని స్పష్టం చేశారు.

కర్ణాటకలో ఇవాళ పలు కీలకనిర్ణయాలు వెలువడే అవకాశం కనిపిస్తోంది. రెబల్ ఎమ్మెల్యేల టీమ్ లోని కాంగ్రెస్‌ సభ్యులు రమేశ్‌ , మహేశ్‌, జేడీఎస్‌కు చెందిన గోపాలయ్య, హెచ్‌.విశ్వనాథ్‌, నారాయణగౌడలపై స్పీకర్‌కు రెండు పార్టీల నేతలు ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వీరిపై అనర్హత వేటు వేయాలని కోరారు. దీనిపై స్పీకర్ ఈ రోజు నిర్ణయం తీసుకోనున్నారు. ఇక రెబల్ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్ తోపాటు.. స్పీకర్ రమేష్ కుమార్ వేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించే అవకాశముంది.

రాజీనామాలపై ఒక్కరోజులో తేల్చాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలతో కర్ణాటకలో నిన్నంతా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి...10 మంది రెబల్ ఎమ్మెల్యేలు ప్రత్యేక విమానాల్లో హుటాహుటీన బెంగళూరు వచ్చి స్పీకర్ ను కలిశారు. మరోసారి రాజీనామాలు అందజేశారు. వెంటనే మళ్లీ విమానంలో ముంబై వెళ్లిపోయారు.. అటు రాజీనామాల సంగతిని ఒక్కరోజులో తేల్చాలన్న ఉత్తర్వును సవరించాలని.. వాటిని నిశితంగా పరిశీలించి, నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందంటూ స్పీకర్‌ సుప్రీం కోర్టు తలుపుతట్టారు. మెరుపు వేగంతో పనిచేయలేనని ..రాజీనామాలపై వెంటనే నిర్ణయం కుదరదని స్పీకర్ రమేష్ కుమార్ స్పష్టం చేశారు...అటు కర్ణాటక సంక్షోభంపై సుప్రీం జోక్యాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు.. న్యాయస్థానానికి స్పీకర్ ను ఆదేశించే అధికారాలు లేవంటున్నారు..ఈ విషయంలో ఓస్థాయి దాటి సుప్రీం కోర్టుకూడా జోక్యం చేసుకోలేదనీ, కేవలం అభిప్రాయాలను మాత్రమే చెప్పొచ్చంటున్నారు..

16 మంది రాజీనామాలతో ఇప్పటికే తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది సంకీర్ణ ప్రభుత్వం. తాజాగా మరో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ లిస్టులో సౌమ్యా రెడ్డి, సుబ్బారెడ్డి, మహంతేశ్‌ , అంజలి నింబాళ్కర్‌ పేర్లు వినిపిస్తున్నాయి.. అదే జరిగే ప్రభుత్వానికి మరిన్ని ఇబ్బందులు తప్పవు.. ఇక రాజీనామా చేసే ప్రసక్తే లేదంటున్నారు సీఎం కుమార స్వామి. అవసరమైతే అవిశ్వాస పరీక్షను కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు...

స్పీకర్ రాజీనామాల వ్యవహారాన్ని ఎటూ తేల్చకపోవడంపై బీజేపీ గుర్రుగా ఉంది. అందుకే ఆయనపై మరింత ఒత్తడి పెంచేదిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది...అసెంబ్లీలో బీజేపీకి ఇప్పటికే 107 మంది సభ్యుల మద్దతుంది. దీంతో స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్ పై సుప్రీం తీర్పు తర్వాత భవిష్యత్ కార్యాచరణపై బీజేపీ ఓ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది...

Next Story

RELATED STORIES