కాంగ్రెస్‌కు ఆశాకిరణం ఎవరు?

సంక్షోభంలో కాంగ్రెస్ కు ఆశాకిరణం ఎవరు? రాహుల్ రాజీనామా తర్వాత పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకోబోయే నాయకుడు ఎవరు? నడిపించే నాయకుడు లేక సతమతం అవుతున్న కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలపై త్వరలోనే సస్పెన్స్ కు పుల్ స్టాప్ పెట్టేందుకు సిద్ధమవుతోంది. వచ్చే వారంలో జరగబోయే సీడబ్ల్యూసీ సమావేశంలో కనీసం తాత్కాలిక అధ్యక్షుడినైనా ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది.

గతమెంతో ఘనమైన కాంగ్రెస్ పార్టీకి ప్రజెంట్ సిచ్యూవేషన్ ఎంటో తెలియని అయోమయ పరిస్థితిలో ఉంది. ఇక భవిష్యత్తు సంగతి సరేసరి. సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన పరాజయంతో రాహుల్ అధ్యక్ష పదికి రాం రాం చెప్పేశారు. ఆయన రాజీనామాపై పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోకున్నా..మళ్లీ అధ్యక్ష బాధ్యతలు తీసుకునేందుకు రాహుల్ ససెమిరా అంటున్నారు.

మరోవైపు అధ్యక్షుడు లేని పార్టీని బీజేపీ మరింత అల్లకల్లోలం చేస్తోంది. సౌత్ లో కొంత పట్టు ఉందని అని చెప్పుకునే రాష్ట్రాల్లో ఆ పార్టీని చావుదెబ్బ తీసే మాస్టర్ ప్లాన్ తో దూసుకుపోతోంది. కర్నాటకలో ఇప్పటికే షో స్టార్ట్ చేసింది. మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోవటమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. గోవాలోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకొని రాజీనామా డ్రామా ఆడిస్తోంది. ఇక తెలంగాణలో కూడా కాంగ్రెస్ నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తూ తాను బలపడుతూ కాంగ్రెస్ ను బలహీనం చేస్తోంది. అదే సమయంలో రాజస్థాన్ లో కాంగ్రెస్ రెబెల్స్ తో కొత్త రాజకీయానికి ప్లాన్ సిద్ధం చేసింది.

అసలే పార్టీకి దిశా నిర్దేశం చేసే నాయకత్వం లేక అల్లాడిపోతున్న కాంగ్రెస్ కు బీజేపీ గేమ్ ప్లాన్ మరింత చావు దెబ్బ తీస్తోంది. దీంతో కొత్త అధ్యక్షుడ్ని ప్రకటించేందుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్. ఇందుకోసం వచ్చే వారంలో సీడబ్ల్యూసీ సమావేశాన్ని ఏర్పాటు చేయబోతోంది. అయితే..ఈ సమావేశంలో తాత్కాలిక అధ్యక్షుడ్ని డిసైడ్ చేయబోతున్నారా? పూర్తికాలపు అధ్యక్షుడ్ని ప్రకటించబోతున్నారా? అనేది పార్టీలో కూడా స్పష్టత లేకుండా పోయింది.

రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేసేందుకు కొన్నేళ్ల పాటు శ్రమించారు యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ. అయితే ఒక్క ఎన్నిక ఫలితాలతో అతను నైరాశ్యపడి పదవికి దూరంగా ఉండటం పార్టీని మరింత సంక్షోభంలోకి నెట్టింది. అధ్యక్ష పదవి ఖాళీగా ఉండటం మరింత నష్టాన్ని కలిగిస్తుండటంతో తాత్కాలిక అధ్యక్షుడివైపు సోనియా మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పార్టీలో కొందరు సీనియర్లు అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండటంతో పూర్తికాల అధ్యక్షుడ్ని ఎన్నుకునే అవకాశాలు లేకపోలేదు. అయితే..తాత్కాలిక అధ్యక్షుడైనా, ఫుల్ టైం అధ్యక్షుడైనా రాహుల్ కు విధేయుడిగా ఉండే సీనియర్ కే ప్రెసిడెంట్ పోస్టు దక్కనుంది. ఇక రాహుల్ స్థానంలో ప్రియాంక గాంధీకి అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని కోరుతున్నారు కొందరు పార్టీ నేతలు.

Tags

Read MoreRead Less
Next Story