కర్ణాటక రాజకీయ సంక్షోభం.. రిజైన్లపై వెనక్కి తగ్గేది లేదు - రెబల్స్

కర్ణాటక రాజకీయ సంక్షోభం.. రిజైన్లపై వెనక్కి తగ్గేది లేదు - రెబల్స్

కర్ణాటక రాజకీయ సంక్షోభం ఇంకా కొలిక్కి రాలేదు. ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్-జేడీఎస్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. రాజీనామాలు వెనక్కి తీసుకోవడానికి రెబల్స్ ససేమిరా అంటున్నా రు. రిజైన్లపై వెనక్కి తగ్గేది లేదని అసంతృప్త ఎమ్మెల్యేలు కుండబద్దలు కొట్టారు. పైగా, ఓవైపు కర్ణాటకలో రాజకీయం పొగలు సెగలు కక్కుతుంటే మరోవైపు రెబల్ ఎమ్మెల్యేలు హ్యాపీగా టూర్లు తిరుగుతున్నారు. ముంబైలో ఉన్న అసంతృప్త ఎమ్మెల్యేలు, ప్రముఖ పర్యాటక ప్రాంతం షిర్డీకి వెళ్లారు. షిర్డీ సాయినాధున్ని దర్శించుకున్నారు. ఇదిలా ఉంటే, మరో ఐదుగురు ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమ రాజీనామాలను స్పీకర్ ఆమోదించడం లేదని రెబల్ ఎమ్మెల్యేలు తమ పిటిషన్‌లో ఆరోపించారు. ఈ ఐదుగురితో కలిపి సుప్రీంకోర్టును ఆశ్రయించిన రెబల్ ఎమ్మెల్యేల సంఖ్య 15కు చేరింది.

ఈరోజంతా కర్ణాటకలో హాట్ హాట్ పరిణామాలు చోటు చేసుకున్నాయి. రెబల్ ఎమ్మెల్యే ఎంటీబీ నాగరాజుతో ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్, డిప్యూటీ సీఎం పరమేశ్వర సుదీర్ఘ చర్చలు జరిపారు. రాజీనామా వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మరో ఎమ్మెల్యే సుధాకర్‌తో నాగరాజు భేటీ అయ్యారు. దాంతో అసంతృప్తులు కాస్త వెనక్కి తగ్గుతున్నట్లే కనిపించింది. రెబల్ ఎమ్మెల్యేలు మళ్లీ పార్టీలోకి వస్తారని, రాష్ట్ర ప్రభుత్వ మనుగడకు వచ్చిన ముప్పు లేదని డీకే కూడా ధీమా వ్యక్తం చేశారు.

డీకేతో సంప్రదింపుల తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య, ఎంటీబీ నాగరాజను కలిశారు. రిజైన్ ఆలోచన మానుకోవాలని సూచించారు. ఇక, అసెంబ్లీలో బల నిరూ పణకు సై అన్న సీఎం కుమారస్వామి, అసంతృప్తులను దారికి తెచ్చుకోవడానికి ప్రయత్నించారు. నలుగురు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలతో ఆయన చర్చలు జరిపారు. మాజీ మంత్రి రామలింగారెడ్డి సహా మరికొందరితోనూ సంప్రదింపులు జరిగినట్లు సమాచారం. ఐతే, చర్చలు-బుజ్జగింపులు ఫలించలేదు. రాజీనామాలు వెనక్కి తీసుకోవడం కుదరదని అసంతృప్త ఎమ్మెల్యేలు తేల్చి చెప్పేశారు. విశ్వాస పరీక్ష వార్తల నేపథ్యంలో బీజేపీ అప్రమత్తమైంది. ఆపరేషన్ కమల్ రివర్స్ కాకుండా, ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఉండేలా చర్యలు తీసుకుంది. ఎమ్మెల్యేలందరిని హోటల్‌కు తరలించిందీ కమలదళం. కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యేలకే కాకుండా, ప్రజలకు కూడా నమ్మకం పోయిందన్నారూ మాజీ సీఎం యడ్యూరప్ప.

Tags

Read MoreRead Less
Next Story