తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ సీరియస్‌గా ఫోకస్ చేసింది. పీసీసీ నియమించిన త్రిసభ్య కమిటీ జిల్లాల వారిగా మున్సిపాలిటీల్లో పార్టీ పరిస్థితులు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. అమలు చెయ్యాల్సిన తక్షణ నిర్ణయాలపై క్షేత్రస్థాయి నేతలకు దిశా నిర్దేశం చేశారు. మొదటి దశలో జిల్లాల వారిగా డీసీసీ సమావేశాలు పెట్టి కసరత్తుకు పదును పెట్టిన హస్తం నేతలు.. మలిదశలో మున్సిపాలిటీల వారిగా భేటిలతో రంగంలోకి దిగారు.
ఇప్పటికే ప్రారంభమైన భేటిల్లో వార్డుల వారిగా పార్టీ బలాబలాలను అంచనా వేస్తున్నారు. ఈ సమావేశాల్లో అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెడుతున్నారు హస్తం నేతలు. అధికార పార్టీకి ధీటుగా అభ్యర్థులను ఎంపికలో పార్టీ నేతల్లో ఏకాభిప్రాయంతీసుకొచ్చేలా ప్రయత్నిస్తున్నారు. అందరి అభిప్రాయాల సేకరణ తరువాత ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను పీసీసీకి సమర్పించనున్నారు జిల్లా డీసీసీ అధ్యక్షులు.
పార్టీ పరంగా మున్సిపల్ ఎన్నికలకు కసరత్తు చేస్తూనే.. వార్డుల పునర్విభజనలో జరుగుతున్న అవకతవకలపై దృష్టి పెట్టింది కాంగ్రెస్. వార్డుల డీలిమిటేషన్‌లో రాజకీయ కుట్ర జరుగుతోందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ నేతలు.. అధికార పార్టీకి అనుకూలంగా ఈ వార్డుల పునర్విభజన జరుగుతోందని మండిపడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని.. మొన్నటి లోక్‌సభ ఎన్నికలే అందుకు నిదర్శనం అంటున్నారు హస్తం నేతలు. పార్లమెంట్ ఫలితాల్లో కేసీఆర్‌కు గట్టి ఝలక్ ఇచ్చిన ప్రజలు.. ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా తగిన గుణపాఠం చెబుతారని గంపెడాశతో ఉన్నారు. పురపాలక పోరులో టీఆర్ఎస్‌కు ధీటుగా గ్రౌండ్‌లోకి దిగిన కాంగ్రెస్.. కేసీఆర్ ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ.. ప్రజల మనస్సులను ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తోంది. మరిహస్తం నేతల ఆశలను పట్టణ ఓటర్లు ఏమేరకు కరుణిస్తారో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com