ముగ్గురు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలకు ప్రమోషన్

గోవాలో మంత్రి వర్గాన్ని విస్తరించారు సీఎం ప్రమోద్‌ సావంత్‌! మంత్రివర్గ విస్తరణలో ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో పాటు ఓ బీజేపీ ఎమ్మెల్యేకు అవకాశం కల్పించారు. రాజభవన్లో కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. ఇందులో ముగ్గురు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు, ఒకరు బీజేపీ శాసనసభ్యుడు ఉన్నారు. కాంగ్రెస్ రెబల్స్ చంద్రకాంత్ కావ్లేకర్, జెన్నిఫర్ మాన్సెరాటే, ఫిలిప్‌నేరీ రోడ్రీగస్, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మైఖేల్ లోబోలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ మృదుల సిన్హా ప్రమాణం చేయించారు.

అయితే.. ఎన్డీయే భాగస్వామి పక్షంగా ఉన్న గోవా ఫార్వర్డ్‌ పార్టీకి చెందిన ముగ్గురితో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతిస్తున్న స్వతంత్ర ఎమ్మెల్యేని మంత్రి వర్గం నుంచి తప్పించారు. గోవాలో కాంగ్రెస్‌కు 15 మంది ఎమ్మెల్యేలున్నారు. ఇందులో ఇటీవల పదిమంది కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి.. ఏకంగా సీఎల్పీని బీజేపీలో విలీనం చేసేశారు. దీంతో కాంగ్రెస్ బలం ఐదుకు పడిపోయింది. ప్రస్తుతం బీజేపీ బలం 27కు పెరిగింది. విలీనం నేపథ్యంలో సీఎం ప్రమోద్ సావంత్, మంత్రివర్గాన్ని విస్తరించారు.

మరోవైపు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంత్రిపదవులు ఇవ్వడంపై అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. మాజీ డిప్యూటీ సీఎం విజయ్ సర్దేశాయ్, బీజేపీ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకోవడమంటే మనోహర్ పారీకర్ వారసత్వాన్ని చంపేయడమేనంటూ ఘాటుగా విమర్శించారు.

Tags

Read MoreRead Less
Next Story